దేశ భాషలందు తెలుగు లెస్స: రాష్ట్రపతి ముర్ము!

దేశ భాషలందు తెలుగు లెస్స: రాష్ట్రపతి ముర్ము!

  • తెలుగు గొప్పదనం దేశం మొత్తానికీ తెలుసని వ్యాఖ్య 
  • వెంకటేశ్వరుడు కొలువై ఉన్న పవిత్ర స్థలానికి రావడం తన అదృష్టమన్న రాష్ట్రపతి
  • ద్రౌపది ముర్ము జీవితం ఆదర్శనీయమన్న ముఖ్యమంత్రి జగన్
తెలుగు భాష, తెలుగు సాహిత్యం దేశ ప్రజలందరికీ సుపరిచితమేనని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తున్న రాష్ట్రపతిని రాష్ట్ర ప్రభుత్వం సన్మానించింది. పోరంకిలో ఏర్పాటు చేసిన ఈ సన్మాన కార్యక్రమంలో రాష్ట్రపతిని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి జగన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా సన్మానించారు. ఈ సందర్భంగా ద్రౌపది ముర్ము మాట్లాడుతూ.. తెలుగు భాష గొప్పదనం దేశం మొత్తానికీ తెలుసని చెప్పారు.

దేశ భాషలందు తెలుగు లెస్స అని ముర్ము కొనియాడారు. వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న పవిత్ర స్థలానికి రావడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. ప్రజలంతా సంతోషంగా ఉండాలని, కనకదుర్గమ్మ ఆశీస్సులు అందరిపైనా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్రానికి చెందిన మహనీయులు అల్లూరి, గురజాడ, కవయిత్రి మొల్ల, దుర్గాభాయ్ తదితరుల పేర్లను రాష్ట్రపతి తన ప్రసంగంలో ప్రస్తావించారు. గోదావరి, కృష్ణ, పెన్నా, వంశధార, నాగావళి నదులు రాష్ట్రాన్ని పునీతం చేశాయన్నారు. ఆంధ్రా ప్రజల అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు.

తొలిసారిగా రాష్ట్రానికి వచ్చిన రాష్ట్రపతిని గౌరవించుకోవడం కోసం ప్రజలందరి తరఫున ద్రౌపది ముర్ముకు పౌర సన్మానం చేసినట్లు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చెప్పారు. కష్టాలను ఎదుర్కొంటూ దేశ అత్యున్నత స్థానానికి ఎదిగిన ద్రౌపది ముర్ము జీవితం అందరికీ ఆదర్శప్రాయమని సీఎం జగన్ పేర్కొన్నారు.

Leave a Reply

%d bloggers like this: