జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాల్సిందే …వారికీ సిపిఎం అండగా ఉంటుంది :నున్నా నాగేశ్వరరావు!

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాల్సిందేవారికీ సిపిఎం అండగా ఉంటుంది :నున్నా నాగేశ్వరరావు!
కోర్టు తీర్పిచ్చినా ఇళ్లస్థలాలు ఇవ్వట్లే..!
వృత్తి భద్రత లేదు..కనీస వేతనం లేదు..
జర్నలిస్టు బంధు అమలు చేయాలి
జర్నలిస్టులకు ఇల్లు ,ఇళ్లస్థలాలు , హెల్త్ కార్డులు ,అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలి

జర్నలిస్టు వృత్తి గౌరవ ప్రదమైనా…సమాజానికి వారు చేస్తున్న సేవలు గొప్పవైనా…పాత్రికేయులు దుర్భర జీవితం అనుభవిస్తున్నారని అటువంటి జర్నలిస్టులను ప్రభుత్వాలు ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు. జర్నలిస్టుల సమస్యల సాధన కోసం పార్టీ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ధర్నా చౌక్‌లో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై.విక్రమ్‌ అధ్యక్షతన చేపట్టిన ధర్నానుద్దేశించి ఆయన మాట్లాడారు. జర్నలిస్టులకు వృత్తిపరమైన భద్రత లేదన్నారు. 90శాతానికి పైగా జర్నలిస్టులు పేద, దిగువ మధ్యతరగతి వర్గాలకు చెందినవారే అయినందునా వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జర్నలిస్టుల సమస్యలను తమ పార్టీ రాష్ట్ర నాయకత్వం సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లిందన్నారు. జనవరిలో జర్నలిస్టుల సమస్యలపై మరింత ఉధృతంగా ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. జర్నలిస్టులకు ఇళ్లు, ఇళ్లస్థలాలు, వర్కింగ్‌ జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్‌, హెల్త్‌ కార్డులు, దళితజర్నలిస్టులకు దళితబంధుతో పాటు జర్నలిస్టులందరికీ జర్నలిస్టు బంధు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. జర్నలిస్టులకు రాయితీతో కూడిన రైల్వేపాస్‌లను పునరుద్ధరించాలని కోరారు. రిటైర్డ్‌ జర్నలిస్టులకు పెన్షన్‌ సౌకర్యం కల్పించాలన్నారు. జీవో నంబర్‌ 239ని సవరించి ఆర్‌ఎన్‌ఐతో నిర్వహిస్తున్న చిన్న పత్రికలనూ ఎంప్యానల్లో చేర్చాలన్నారు. డిజిటల్‌ మీడియా సమస్యలు పరిష్కరించాలని, జర్నలిస్టులపై దాడులు అరికట్టాలని, మహిళా జర్నలిస్టులకు రక్షణ చట్టం చేయాలని, డెస్క్‌ జర్నలిస్టులకు ఉద్యోగభద్రతతో పాటు ఆరున్నర గంటలకు మించి పనిచేయించొద్దని డిమాండ్‌ చేశశారు. యాడ్స్‌, సర్క్యులేషన్‌ పేరుతో జర్నలిస్టులను వేధింపులకు గురిచేయొద్దని కోరారు. మంత్రి అజయ్‌ చొరవ తీసుకుని జర్నలిస్టుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని సూచించారు. జర్నలిస్టుల సంఖ్య తక్కువే కదా…! వారి సమస్యను పక్కకు పెట్టాలనే ధోరణిలో ప్రభుత్వం వ్యవహరిస్తే జనవరి నుంచి మిగిలిన కార్మికుల మాదిరిగానే జర్నలిస్టుల తరఫునా సీపీఐ(ఎం) ఉధృతంగా ఉద్యమాలు నిర్వహిస్తుందన్నారు.

పలు జర్నలిస్టు, వివిధ సంఘాల మద్దతు

సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ధర్నాకు వివిధ జర్నలిస్టు సంఘాలు మద్దతు తెలిపాయి. తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్ట్సు ఫెడరేషన్‌ (టీడబ్ల్యూజేఎఫ్‌), తెలంగాణ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్సు (టీయూడబ్ల్యూజే (ఐజేయూ)), తెలంగాణ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్స్టు (టీజేఎఫ్‌), తెలంగాణ వీడియో జర్నలిస్స్ట్‌ అసోసియేషన్‌ (టీవీజేఏ), తెలంగాణ జర్నలిస్ట్సు అసోసియేషన్‌ (టీజేఏ)తో పాటు విద్యావంతుల వేదిక మద్దతు ప్రకటించాయి. మజిదీయా కమిషన్‌ సూచన మేరకు వేజ్‌బోర్డు అమలు చేసి జర్నలిస్టులకు కనీస వేతన చట్టం అమలు చేయాలని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.రాంనారాయణ డిమాండ్‌ చేశారు. ప్రెస్‌ కౌన్సిల్‌ ఏర్పాటుకు డిమాండ్‌ చేశారు.

జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం, యాజమాన్యాలు పరిష్కరించాలని టీడబ్ల్యూజేఎఫ్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పల్లా కొండలరావు, కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి కోరారు. 90శాతానికి పైగా పేద, మధ్యతరగతి వర్గాల జర్నలిస్టులున్న నేపథ్యంలో వారిని ఆర్థికంగా, వృత్తిపరంగా ఆదుకోవాలని టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్‌) జిల్లా నాయకులు గుద్దేటి రమేష్‌బాబు, రాంబాబు అన్నారు. ఎలక్ట్రానిక్‌ మీడియా జర్నలిస్టులను సైతం నేరుగా వర్కింగ్‌ జర్నలిస్టులుగా పరిగణించాలని సీనియర్‌ జర్నలిస్టు ఎన్‌.వెంకట్రావ్‌ డిమాండ్‌ చేశారు. జర్నలిస్టుల ఇళ్లస్థలాలు, ఇళ్ల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని మరికొందరు సీనియర్‌ జర్నలిస్టులు ఏనుగు వెంకటేశ్వర్లు, వనం వెంకటేశ్వర్లు, మైసా పాపారావు, వెంకట్రావ్‌, నారాయణ, కనకం సైదులు, పారుపల్లి కృష్ణారావు, పురుషోత్తం, మురళి, తదితరులు ప్రశ్నించారు. టీడబ్ల్యూజేఎఫ్‌ జిల్లా కోశాధికారి తేనె వెంకటేశ్వర్లు వందన సమర్పణ చేశారు. జర్నలిస్టు వృత్తిపై చివరగా కట్టెకోల చిననర్సయ్య వినిపించిన కవిత ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు యర్రా శ్రీకాంత్‌, పొన్నం వెంకటేశ్వర్లు, బండి రమేష్‌, బంతు రాంబాబు, జిల్లా కమిటీ సభ్యులు ఎస్‌.నవీన్‌రెడ్డి, భూక్యా శ్రీనివాస్‌, యర్రా శ్రీనివాస్‌, వివిధ జర్నలిస్టు యూనియన్‌ నాయకులు సాతుపాటి రాము, బాలకృష్ణ, మోహన్‌రావు, డి.వెంకటేశ్వర్లు, ఆవుల రామారావు, కర్ణబాబు, సాయిరాఘవ, శ్రీధర్‌, విష్ణు, అప్పారావు, మాధవ్‌, గణేశ్‌, రాఘవ, పి. శ్రీనివాస్‌, జక్కుల వెంకటరమణ, సాయి, నాగుల్‌మీరా, జీఎన్‌ స్వామి, గంగాధర్‌, మాధవరావు, బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

%d bloggers like this: