గుజరాత్, హిమాచల్ ఎన్నికల ఫలితాలపై మోదీ స్పందన !

గుజరాత్, హిమాచల్ ఎన్నికల ఫలితాలపై మోదీ స్పందన !

  • గుజరాత్ ప్రజలు బీజేపీతో ఉన్నారని మరోసారి నిరూపితమైందన్న మోదీ
  • తమపై నమ్మకం, విశ్వాసంతోనే మళ్లీ అధికారం కట్టబెట్టారని వ్యాఖ్య
  • ఓడిపోయినా హిమాచల్ అభివృద్ధికి సహకరిస్తామని ప్రధాని స్పష్టీకరణ

గుజరాత్ ప్రజలు బీజేపీతోనే ఉన్నారని మరోసారి నిరూపితం అయ్యిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తమపై ఎంతో నమ్మకం, విశ్వాసంతో మళ్లీ అధికారాన్ని కట్టబెట్టారని తెలిపారు. జాతి, కుల, మతాలకు అతీతంగా బీజేపీకి ఓట్లు వేశారని చెప్పారు. గుజరాత్, హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని ప్రసంగించారు. ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చిన రికార్డును బ్రేక్ చేయాలని ప్రస్తుత ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ను కోరానని చెప్పారు.  గుజరాత్ ప్రజలు అదే చేసి చూపించారని, సరికొత్త చరిత్ర సృష్టించారని కొనియాడారు.

భూపేంద్రపై మోదీ ప్రశంసలు కురిపించారు. ఘట్లోడియా సెగ్మెంట్ నుంచి 2.13లక్షల భారీ మెజార్టీతో గెలిచిన భూపేంద్రది అసాధారణ విజయం అని కొనియాడారు. ఎన్నికల ఫలితంతో బీజేపీ కార్యకర్తల కష్టానికి ఫలితం దొరికిందని మోదీ అన్నారు. ఉత్తర ప్రదేశ్, బీహార్ ఉప ఎన్నికల్లోనూ బీజేపీ సత్తా చాటిందన్నారు.

మరోవైపు బీజేపీ అధికారం కోల్పోయిన హిమాచల్ ప్రదేశ్ ఫలితంపై మోదీ స్పందించారు. హిమాచల్ లో గెలుపోటముల మధ్య ఒక్క శాతం మాత్రమే తేడా ఉందన్నారు. ఓడిపోయినా హిమాచల్ ప్రదేశ్ అభివృద్ధికి వంద శాతం సహకరిస్తామని మోదీ స్పష్టం చేశారు. బీజేపీ దేశం కోసం కఠినమైన, పెద్ద నిర్ణయాలు తీసుకుంటుందని మోదీ తెలిపారు.

Leave a Reply

%d bloggers like this: