వరుడి ముక్కు చిన్నగా ఉందని అమ్మలక్కల గుసగుసలు …పెళ్లి రద్దు చేసుకున్న వధువు ..

వరుడి ముక్కు చిన్నగా ఉందని అమ్మలక్కల గుసగుసలు.. పెళ్లి రద్దు చేసుకున్న వధువు!

  • ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో ఘటన
  • వివాహం కోసం ఊరేగింపుగా వధువు ఇంటికి చేరుకున్న వరుడి కుటుంబం
  • కాబోయేవాడి ముక్కు చిన్నగా ఉండడంతో వధువు తీవ్ర నిర్ణయం
  • ఇరు కుటుంబాల వారు నచ్చజెప్పినా ససేమిరా

పెళ్లి కొచ్చిన వారు వరుడి ముక్కు చిన్నగా ఉందని కొందరు గుసగుసలాడుకోవడం వధువు చెవిన పడింది. దీంతో ఆమె తీవ్ర నిర్ణయం తీసుకుంది. ఈ వరుడు తనకు వద్దంటూ ఏకంగా పెళ్లినే రద్దు చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో జరిగిందీ ఘటన. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన యువతీయువకులకు వివాహం నిశ్చయమైంది. బుధవారం పెళ్లి జరగాల్సి ఉండగా వధువు ఇంటికి వరుడి కుటుంబం ఊరేగింపుగా చేరుకుంది. పెళ్లి కొచ్చిన వారితో వధువు ఇల్లు సందడిగా మారింది.

ఈ క్రమంలో పెళ్లికొచ్చిన వారిలో కొందరు మహిళలు వరుడ్ని చూసి అతడి ముక్కు చాలా చిన్నగా ఉందని గుసగుసలాడుకున్నారు. ఇది అటూఇటూ తిరిగి అది వధువు చెవిన పడింది. వారి మాటలు నిజమో, కాదో తెలుసుకునేందుకు స్వయంగా వెళ్లి చూసింది. కాబోయే వాడి ముక్కు నిజంగానే కాస్తంత చిన్నగా ఉండడంతో తీవ్ర నిర్ణయం తీసుకుంది. తాను అతడిని పెళ్లి చేసుకోబోనంటూ మంకుపట్టు పట్టింది. దీంతో కంగుతిన్న ఇరు కుటుంబాల వారు వధువుకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో పెళ్లి అర్ధాంతరంగా ఆగిపోయింది.

Leave a Reply

%d bloggers like this: