కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పదవుల్లో చోటు లేకపోవడానికి రేవంత్ రెడ్డితో విభేదాలే కారణమా …?

కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డికి షాకిచ్చిన కాంగ్రెస్​ అధిష్టానం!

  • టీపీసీసీ కొత్త కమిటీలకు హైకమాండ్ ఆమోద ముద్ర
  • ఎగ్జిక్యూటివ్‌, పొలిటికల్‌ ఎఫైర్స్‌ కమిటీల్లో వెంకట్ రెడ్డికి చోటు దక్కని వైనం
  • రేవంత్ రెడ్డితో విభేదాలే కారణమంటూ చర్చ!

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఆ పార్టీ అధిష్ఠానం షాకిచ్చింది. టీపీసీసీ కొత్త కమిటీలను ప్రకటించిన అధిష్ఠానం అందులో వెంకట్ రెడ్డికి అవకాశం ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి చైర్మన్ గా పీసీసీ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ, మాణికం ఠాకూర్ చైర్మన్ గా పొలిటికల్‌ ఎఫైర్స్‌ కమిటీలకు కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదముద్ర వేశారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఒక ప్రకటనలో వెల్లడించారు. పీసీసీ స్టార్‌ క్యాంపెయినర్‌ గా ఉన్న కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డికి రెండు కమిటీల్లోనూ చోటు దక్కకపోవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. రేవంత్ చైర్మన్ గా ఉన్న ఎగ్జిక్యూటివ్‌ కమిటీలో 40 మందికి చోటు ఇచ్చారు. పొలిటికల్‌ ఎఫైర్స్‌ కమిటీలో సభ్యులుగా 17 మందికి అవకాశం లభించింది. వెంకట్ రెడ్డి మినహా మిగతా సీనియర్ నాయకులందరికీ ఏదో కమిటీలో చోటు దక్కింది.

కొన్నాళ్లుగా పార్టీలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యవహారశైలి చర్చనీయాంశంగా మారింది. వెంకట్ రెడ్డి తమ్ముడు రాజగోపాల్ రెడ్డి ఈ మధ్యే కాంగ్రెస్ కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో వెంకట్ రెడ్డి ప్రచారానికి దూరంగా ఉన్నారు. అదే సమయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. కొంతకాలంగా పార్టీకి అంటిముట్టనట్టుగా ఉంటున్న నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి టీపీసీసీ కొత్త కమిటీల్లో చోటు ఇవ్వలేదని తెలుస్తోంది. రేవంత్ తో విభేదాల కారణంగానే ఆయనకు పార్టీలో ప్రాధాన్యత తగ్గిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. ఈ పరిణామం తర్వాత వెంకట్ రెడ్డి ఎలా స్పందిస్తారు? ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

Leave a Reply

%d bloggers like this: