సరిహద్దుల్లో పోరుపై ప్రకటన చేసిన చైనా !

సరిహద్దుల్లో పోరుపై ప్రకటన చేసిన చైనా !

  • భారత్ తో సరిహద్దు వద్ద పరిస్థితులు స్థిరంగానే ఉన్నాయన్న చైనా
  • దౌత్య, సైనిక మార్గాల ద్వారా చర్చలు కొనసాగుతాయని వెల్లడి
  • చైనా విదేశాంగ అధికార ప్రతినిధి వాంగ్ వెన్ స్పందన

భారత్ సరిహద్దుల్లో పరిస్థితులు నిలకడగా ఉన్నట్టు చైనా ప్రకటించింది. అరుణాచల్ లోని తవాంగ్ వద్ద డిసెంబర్ 9న చైనా సైనికులు భారత్ వాస్తవాధీన ప్రాంతంలోకి చొచ్చుకు రాగా, భారత సైనికులు ప్రతిఘటించారని, ఇరువైపులా సైనికులు గాయపడినట్టు మన దేశం ప్రకటించడం తెలిసిందే. దీనిపై రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పార్లమెంట్ లో కీలకమైన ప్రకటన కూడా చేశారు. భారత్ భూభాగాన్ని ఆక్రమించేందుకు చైనా సైనికులు ప్రయత్నించగా, బలంగా తిప్పికొట్టినట్టు చెప్పారు.

దీంతో చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్ బిన్ స్పందన తెలియజేశారు. ‘‘మాకు తెలిసినంత వరకు చైనా-భారత్ సరిహద్దు పరిస్థితులు మొత్తం మీద స్థిరంగానే ఉన్నాయి. సరిహద్దు అంశంపై దౌత్య, సైనిక మార్గాల ద్వారా ఎటువంటి అడ్డంకుల్లేని చర్చలు కొనసాగుతున్నాయి’’ అని చెప్పారు. తాజా ఘర్షణలో ఎవరూ మరణించలేదని, పెద్ద గాయాలు కూడా కాలేదని, స్వల్ప గాయాలే అయినట్టు భారత ఆర్మీ మరో వివరణ ప్రకటన కూడా జారీ చేయడం గమనార్హం.

మన భూమిని ఆక్రమించుకునేందుకు చైనా యత్నించింది: రాజ్ నాథ్ సింగ్!

China tried to encroach Indian land says Raj Nath Singh in Lok Sabha

డిసెంబర్ 9న అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సెక్టార్ లో భారత భూభాగాన్ని ఆక్రమించుకునేందుకు చైనా యత్నించిందని భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. మన భూభాగంలోకి చొచ్చుకుని వచ్చేందుకు చైనా సైన్యం ప్రయత్నించిందని… అయితే మన సైనికులు వారి ప్రయత్నాలను తిప్పికొట్టారని తెలిపారు. వాళ్లు వెనక్కి తిరిగి వెళ్లేలా చేశారని చెప్పారు. లోక్ సభలో ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ విషయాన్ని దౌత్య మార్గాల ద్వారా చైనాతో చర్చించామని తెలిపారు. వారు చేసిన పనిపై అభ్యంతరం వ్యక్తం చేశామని చెప్పారు.

మన సైనికులు మన సరిహద్దులను కాపాడేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నారని రాజ్ నాథ్ తెలిపారు. ఎవరు ఎలాంటి ప్రయత్నం చేసినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈ స్టాండాఫ్ లో ఇరు దేశాలకు చెందిన కొందరు సైనికులు గాయపడ్డారని తెలిపారు. ఎవరూ కూడా తీవ్రంగా గాయపడటం కానీ, మృతి చెందడం కానీ జరగలేదనే విషయాన్ని సభాముఖంగా చెపుతున్నానని అన్నారు. భారత మిలిటరీ కమాండర్లు క్షణాల్లోనే ప్రతిస్పందించడంతో…. చైనా సైనికులు వారి ప్రాంతానికి వెనుదిరిగి పోయారని చెప్పారు. ఇండియా – చైనా స్టాండాఫ్ పై కేంద్ర ప్రభుత్వం స్పందించాలంటూ ఉదయం నుంచి పార్లమెంటు ఉభయసభల్లో విపక్షాలు పట్టుబట్టాయి. ఈ నేపథ్యంలో రాజ్ నాథ్ లోక్ సభలో పై వివరాలను వెల్లడించారు.

Leave a Reply

%d bloggers like this: