కాంగ్రెస్ లో పెద్ద చేపలకు బీఆర్ యస్ వల…!

కాంగ్రెస్ లో పెద్ద చేపలకు బీఆర్ యస్ వల…!
-చిక్కుకుంటాయా …?తప్పించుకుంటాయా ??
-కాంగ్రెస్ లో అసమ్మతిని సొమ్ముచేసుకునేందుకు గులాబీ దళం విశ్వప్రయత్నాలు
-ఇప్పటికే పలువురు డైరెక్ట్ గా కేసీఆర్ టచ్ లో ఉన్నట్లు ప్రచారం

జాతీయపార్టీగా అవతరించిన బీఆర్ యస్ దేశవ్యాపితంగా పార్టీని విస్తరించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తుంది.అందులో భాగంగా తెలంగాణాలో తిరిగి అధికారంలోకి రావడం కీలకంగా మారింది. కాంగ్రెస్ లో ఉన్న సీనియర్లు కమిటీల ఎంపిక ,నియామకాలు సరిగా లేవని అధిష్టానం వ్యవహారశైలిపై గుర్రుగా ఉన్నారు . ఇటీవల నియమించిన రాష్ట్ర కార్యవర్గం , పొలిటికల్ అఫైర్స్ కమిటీలో కూడా పార్టీని నమ్ముకొని ఉన్నవాళ్లకు కాకుండా పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికీ రేవంత్ రెడ్డి చెప్పిన వారికీ మాత్రమే పదవులు ఇచ్చారనే అభిప్రాయాలు ఉన్నాయి. కాంగ్రెస్ లో ఉన్న అసమ్మతిని అందిపుచ్చుకునేందుకు బీఆర్ యస్ వేగంగా పావులు కదుపుతుంది.దీనిలో భాగంగానే తెలంగాణాలో కాంగ్రెస్ అసమ్మతినేతలకు వల వేసేందుకు బీఆర్ యస్ ముమ్మర ప్రయత్నాలు చేస్తుంది .ఇప్పటికే కొంతమంది రాష్ట్ర కాంగ్రెస్ అగ్రనేతలు కేసీఆర్ తో టచ్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. వారిలో సీనియర్ నేతలు పార్టీలో చట్టసభల్లో కీలక భాద్యతలు నిర్వహిస్తున్నవారు సైతం కేసీఆర్ తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారనేది కాంగ్రెస్ లో చర్చనీయాంశంగా మారింది. వారు పార్టీ అధిష్టానం చేసే నిర్ణయాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు . పార్టీలో ఉండాలా లేక బయటకు వెళ్లాలా అనే సంఘర్షణలో నలుగుతున్నారు. ఒకవేళ బీఆర్ యస్ రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వస్తే కాంగ్రెస్ లో ఉన్న పెద్ద నాయకులు బీఆర్ యస్ లో చేరితే మంచి పొజిషన్ ఇచ్చేందుకు కేసీఆర్ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తుంది.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచినా 19 ఎమ్మెల్యేలలో 12 మంది కాంగ్రెస్ బై చెప్పి గులాబీ పార్టీలో చేరారు . మిగిలిన వారిలో రాజగోపాల్ రెడ్డి బీజేపీ లో చేరగా మునుగోడు లో జరిగిన ఉపఎన్నికల్లో ఆయన బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు . ఇక మిగిలింది. సీఎల్పీ నేత భట్టి , భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, ములుగు ఎమ్మెల్యే సీతక్క , మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు , సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఉన్నారు . వీరిలో కూడా జగ్గారెడ్డి నిత్యం అసంతృప్తి తో ఉన్నారు . ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఉన్నారు . ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి , కోమటిరెడ్డి వెంకటరెడ్డి , టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు . కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికి గణనీయమైన ఓటు బ్యాంకు ఉన్నది . కానీ సరైన నాయకత్వం లేదనే అభిప్రాయాలు ప్రజల్లో బలంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపిద్దామనుకున్న ఓటర్లు సైతం పునరాలోచనలో పడ్డారు . ఒకవేళ గెలిపించిన వారు కాంగ్రెస్ లో ఉంటారనే నమ్మకం లేకుండా పోయింది. కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్లేందుకు సిద్దపడతాయన్న లెఫ్ట్ పార్టీలు సైతం బీఆర్ యస్ తో కలిసి వెళ్లేందుకు సిద్ధపడుతున్నాయి. ఫలితంగా కాంగ్రెస్ లో ఉండేదెవరు ,పోయేదెవరనే ఆసక్తి నెలకొన్నది …

Leave a Reply

%d bloggers like this: