రాహుల్ గాంధీ వెరీ లక్కీ..జైరాం రమేశ్!

రాహుల్ గాంధీ వెరీ లక్కీ.. అంటూ ఎందుకో చెప్పిన జైరాం రమేశ్!

  • రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థులతో రాహుల్ సంభాషణ
  • విద్యార్థులు నాలుగైదు రంగాలను మాత్రమే కెరియర్‌గా ఎంచుకుంటున్నారన్న రాహుల్
  • ఆస్ట్రోనాట్ అయ్యే అవకాశం వచ్చినా డాక్టరే అవుతామంటూ విద్యార్థుల సమాధానం
  • తాను కూడా తండ్రి కోరిక మేరకు ఐఐటీలో సీటు సాధించానన్న జైరాం రమేశ్
  • కెరియర్‌ను ఎంచుకోవడానికి ముందు ప్రపంచాన్ని చూసి నేర్చుకోమని తండ్రి తనతో చెప్పారన్న రాహుల్

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చాలా అదృష్టవంతుడని ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ అన్నారు. రాహుల్ ఇటీవల రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థులతో సంభాషించారు. ఈ సందర్భంగా వారు ఇంజినీరింగ్ చదవాలనుకుంటున్నారా? లేక మెడిసినా? అని ఆరా తీశారు. ఈ సమయంలో కల్పించుకున్న పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్.. రాహుల్ గాంధీ చాలా అదృష్టవంతుడని, ఆయన ఏం చదవాలనుకుంటే తల్లిదండ్రులు అదే చదవించారని అన్నారు. కానీ ఇప్పటి తల్లిదండ్రులు అలా కాదని, చాలామంది మెడిసిన్ లేదంటే ఇంజినీరింగ్ చదవాలని పిల్లలపై ఒత్తిడి తీసుకొస్తున్నారని అన్నారు. వారి అభిరుచులను పిల్లలపై రుద్దుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యార్థులతో రాహుల్ మాట్లాడుతూ.. తాను విద్యార్థులతో సంభాషించినప్పుడు భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నారని వారిని ప్రశ్నిస్తే నాలుగైదు రకాల సమాధానాలు మాత్రమే వస్తున్నాయన్నారు. ఇంజినీరింగ్, డాక్టర్, ఆర్మీ, ఐఏఎస్, టీచర్, జడ్జ్ కావాలనుకుంటున్నట్టు చెబుతున్నారని అన్నారు. విద్యార్థులందరూ ఇవే రంగాలను ఎందుకు ఎంచుకుంటున్నారని రాహుల్ ప్రశ్నించారు. 

మీ కెరియర్‌పై మీకు స్వేచ్ఛ లభిస్తే మీరు ఏం ఎంచుకుంటారన్న రాహుల్ ప్రశ్నకు ఓ విద్యార్థి నుంచి డాక్టర్ అవుతానన్న సమాధానం వచ్చింది. రాహుల్  స్పందిస్తూ.. ‘‘సరే, మీకు వ్యోమగామి అయ్యే అవకాశం వచ్చిందనుకోండి.. అయినప్పటికీ కూడా మీరు డాక్టరే అవుతారా?’’ అన్న రాహుల్ ప్రశ్నకు విద్యార్థులు అవునని సమాధానం ఇచ్చారు. ‘అయినా కూడా’ అని రాహుల్ మరోమారు ప్రశ్నించగా ‘అవునని’ విద్యార్థులు అదే సమాధానం చెప్పారు. 

అప్పుడు జైరాం రమేశ్ కల్పించుకుని ‘‘రాహుల్ జీ, నాకు 16 సంవత్సరాలు ఉన్నప్పుడు నా తండ్రి ఐఐటీలో చదవాలని నాకు చెప్పారు. నేను పరీక్ష రాసి అందులో సీటు సంపాదించాను. కానీ మీరు మాత్రం చాలా లక్కీ. మీరేం చదవాలనుకుంటే మీ తల్లిదండ్రులు అది చదివించారు’’ అని అన్నారు. 

ఆయన వ్యాఖ్యలకు రాహుల్ స్పందిస్తూ.. ‘‘తొలుత ప్రపంచాన్ని చూడమని, అన్నీ తెలుసుకోవాలని నా తండ్రి నాకు చెప్పారు. ఆ తర్వాతే నువ్వేం కావాలనుకుంటున్నావో నిర్ణయం తీసుకోమన్నారు’’ అని  చెప్పుకొచ్చారు. ‘‘కానీ మీరు మాత్రం ముందే డాక్టర్లు, ఇంజినీర్లు కావాలని నిర్ణయం తీసేసుకున్నారు’’ అని విద్యార్థులను ఉద్దేశించి రాహుల్ అన్నారు. అప్పుడో విద్యార్థి స్పందిస్తూ.. తమకు ఈ మూడు నాలుగు కెరియర్లనే ఆప్షన్లుగా ఎంచుకోవాలని తెలుసని, ఇతర కెరియర్ ఆప్షన్ల గురించి తెలియదని అన్నాడు. తమ తల్లిదండ్రులకు కూడా ఇవి తప్ప ఇతర కెరియర్లపై అంతగా అవగాహన లేదని చెప్పుకొచ్చాడు. 

Leave a Reply

%d bloggers like this: