విజయవాడకు 150 కి.మీ. వేగంతో దూసుకుపోయే హైస్పీడ్ రైలు!

విజయవాడకు 150 కి.మీ. వేగంతో దూసుకుపోయే హైస్పీడ్ రైలు!

  • విజయవాడకు వందేభారత్ ఎక్స్ ప్రెస్ కేటాయింపు
  • బెజవాడ నుంచి సికింద్రాబాద్ లేదా వైజాగ్ కు సర్వీసులు
  • విమానంలో ప్రయాణించే అనుభూతిని కలిగించే వందేభారత్ రైళ్లు

ఏపీకి గంటకు 150 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే వందేభారత్ హైస్పీడ్ రైలు రాబోతోంది. చెన్నైలోని ఇంటెగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీలో ఈ రైలు తయారవుతోంది. వందేభారత్ రైళ్లను దక్షిణాది రాష్ట్రాల్లో ప్రవేశపెట్టాలని కేంద్ర రైల్వే శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగానే విజయవాడకు కేంద్రం ఈ రైలును కేటాయించింది. ఈ రైలుకు సంబంధించి రెండు రూట్లు పరిశీలనలో ఉన్నాయి. విజయవాడ – సికింద్రాబాద్ లేదా విజయవాడ – విశాఖ రూట్లను రైల్వే అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు రూట్లలో 100 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే రైళ్లు ఉన్నాయి. వందే భారత్ రైలు వల్ల ప్రయాణ సమయం భారీగా తగ్గపోతుంది.

వాస్తవానికి వందేభారత్ ఎక్స్ ప్రెస్ లకు 200 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే సామర్థ్యం ఉంది. అయితే, 180 కిలోమీటర్లకు ఈ రైళ్లకు రైల్వే అధికారులు సర్టిఫై చేశారు. ట్రాక్ బలాన్ని బట్టి ఈ రైళ్లు గరిష్ఠంగా 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వీలుంది. ఈ రైళ్లు సాధారణ ట్రైన్స్ మాదిరి కాకుండా ఏరో డైనమిక్ షేప్ లో ఉంటాయి. కోచ్ లు కూడా అత్యంత అధునాతనంగా ఉంటాయి. కోచ్ లలో ఎల్ఈడీ టీవీలు, వైఫై సదుపాయం, రీడింగ్ లైట్స్, పెద్దపెద్ద కిటికీలు, రొటేట్ అయ్యే సీట్లు తదితర సదుపాయాలు అదనంగా ఉంటాయి. ఆటోమేటిక్ డోర్లు ఉంటాయి. బయో వాక్యూమ్ టాయ్ లెట్స్, సెన్సార్ వాటర్ ట్యాప్స్, సీసీ టీవీ కెమెరాల వంటివి కూడా ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే విమానంలో ప్రయాణిస్తున్న అనుభూతి కలుగుతుంది.

Leave a Reply

%d bloggers like this: