Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

జగన్ ఇంత అవినీతి పరుడని అనుకోలేదు … డీ ఎల్ రవీంద్రా రెడ్డి !

రాజశేఖర్ రెడ్డి కుమారుడు ఇంత అవినీతిపరుడు అనుకోలేదు: డీఎల్ రవీంద్రారెడ్డి!

  • కడపలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి
  • వైసీపీలో ఉన్నందుకు అసహ్యం వేస్తోందని వెల్లడి
  • పరిపాలన తొలిరోజు నుంచే అవినీతి చేస్తున్నారని విమర్శలు
  • రాష్ట్రాన్ని బాగు చేసే సత్తా చంద్రబాబుకే ఉందని వ్యాఖ్య  

తానింకా వైసీపీలోనే ఉన్నానని, వాళ్లేమీ తనను తీసేయలేదని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి పేర్కొన్నారు. ఆయన ఇవాళ కడపలో మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో ఉన్నందుకు నాకే అసహ్యంగా ఉంది అంటూ వ్యాఖ్యానించారు. తాను వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడాల్సి వస్తోందని, రాజశేఖర్ రెడ్డి కుమారుడు ఇంత అవినీతిపరుడు అనుకోలేదని విమర్శించారు.

“ఎన్నికలకు ముందు కొందరు ముఖ్యమైన రెడ్లు సమావేశం అయ్యారు. అన్నా నాకుంది ఇద్దరూ కూతుర్లే కదా, ఆల్రెడీ మా నాన్న ద్వారా 30, 40 వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి… నేను అవినీతికి పాల్పడకుండా మా నాన్న కంటే మంచిపేరు తెచ్చుకుంటాను అని జగన్ చెప్పినట్టు ఆ ముఖ్యమైన రెడ్లు కూడా చెప్పారు. ఎన్నికల తర్వాత రిజల్ట్ రాకముందు నాతో కూడా అదే చెప్పాడు. నేను అవినీతి చేయను అన్నా… చాలా మంచి పరిపాలన అందిస్తాను అని అన్నాడు.

కానీ పరిపాలన మొదలుపెట్టినప్పటి నుంచి అవినీతే. ఇసుకలోనూ అవినీతికి పాల్పడ్డారు. మాలాంటివాళ్ల సలహాలు తీసుకుంటే కదా పరిపాలన మంచిగా సాగేది… అలా కాకుండా డబ్బు కోసమే పరిపాలన చేస్తుంటే ఎలా…?

నా పనితీరు గురించి తెలిసిన ఏ పార్టీ అయినా వచ్చే ఎన్నికల్లో నన్ను తీసుకుంటుందని ఆశిస్తున్నా. ఏ పార్టీ గేటు వద్దకు వెళ్లి సీటు అడిగి తీసుకోను. ఏదైనా గుర్తింపు ఉన్న పార్టీ తరఫున పోటీ చేస్తాను. ఇంకా ఏ పార్టీ నుంచి ఆఫర్ రాలేదు.

అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రాన్ని బాగు చేయాలంటే చంద్రబాబుకు మాత్రమే సాధ్యం అనుకుంటున్నాను. ఏసు క్రీస్తు, అల్లా, వెంకటేశ్వరస్వామి వచ్చినా రాష్ట్రాన్ని బాగు చేయలేనంతగా పరిస్థితులు ఉన్నాయి. కానీ మనలో చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రాన్ని తీర్చిదిద్దుకోవచ్చు. చంద్రబాబు అయితే బాగు చేయగలడని నా నమ్మకం. ఎందుకంటే… 94లో నేను విపక్ష పార్టీ ఎమ్మెల్యేగా గెలిచాను. ఎన్టీఆర్ అనేక పథకాలు పెట్టడంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారింది. 95లో ఎన్టీఆర్ దిగిపోయారు. అప్పుడు చంద్రబాబే పరిస్థితిని చక్కదిద్ది రాష్ట్రాన్ని గాడినపెట్టారు.

ఇక పవన్ కల్యాణ్ నిజాయతీని ఎవరూ తప్పుబట్టలేరు. కానీ పవన్ కు పరిపాలనా దక్షత ఉందని నేను అనుకోవడంలేదు. చంద్రబాబు, పవన్ కలుస్తారో లేదో తెలియదు కానీ… వాళ్లిద్దరూ కలిసి ఏపీని పునరుద్ధరిస్తారని ఆశిస్తున్నా” అని డీఎల్ రవీంద్రరెడ్డి వివరించారు.

Related posts

గవర్నర్ తన విశేష అధికారాలతో టీఎస్ పీఎస్సీని రద్దు చేయాలి: రేవంత్ రెడ్డి

Drukpadam

కేంద్ర బడ్జెట్ ఒక పనికిమాలిన, పసలేని బడ్జెట్…కేసీఆర్…

Drukpadam

కమిషన్ల తెలంగాణ… అవినీతిలో కర్ణాటకకు మించిపోయింది ..ఠాక్రే

Drukpadam

Leave a Comment