ఖమ్మం సభలో అరిగిపోయిన రికార్డ్ ల సాగిన చంద్రబాబు ప్రసంగం …!
ఖమ్మం సభలో అరిగిపోయిన రికార్డ్ ల సాగిన చంద్రబాబు ప్రసంగం …!
–కేసీఆర్ పాలనపై విరుచకపడ్డ టీడీపీ నేతలు
–వారి అభిప్రాయాలకు భిన్నంగా చంద్రబాబు ఉపన్యాసం
–బీజేపీ …బీఆర్ యస్ పై క్లారిటీ ఇవ్వని బాబు
–పాటల్లోనూ కేసీఆర్ సర్కారును ఉతికి ఆరేసిన టీడీపీ కళాకారులు
–సభకు చుట్టుపక్కల జిల్లాల నుంచి వచ్చిన కార్యకర్తలు
టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చాలాకాలం తర్వాత పెట్టిన ఖమ్మం బహిరంగసభకు ప్రజలు స్వచ్చందంగానే తరలి రావడం విశేషం …కానీ ఆయన ప్రసంగంపైనే పలువురు పెదవి విరిచారు . చంద్రబాబు రాకముందు మాట్లాడని వక్తలందరు . తెలంగాణలోని కేసీఆర్ పాలనపై విరుచకపడ్డారు . కళాకారులు సైతం వారి పాటల ద్వారా కేసీఆర్ సర్కార్ ను ఉతికి ఆరేశారు …చంద్రబాబు ఎక్కడ కేసీఆర్ సర్కారుపై మాట్లాడక పోవడం ,బీజేపీపై కేంద్రం పై తన విధానాలు చెప్పకపోవడం చర్చనీయాంశంగా మారింది. టీడీపీ నేతలు సైతం చంద్రబాబు బీఆర్ యస్ , బీజేపీ లపై క్లారిటీ ఇస్తే బాగుండేదని గుసగుసలు వినిపించాయి.
ఆయన ప్రసంగంలో ఎక్కడ బీజేపీ …బీఆర్ యస్ పార్టీలపై తన వైఖరిని వెల్లడించలేదు సరికదా పైగా తెలంగాణాలో తాను ప్రారంభించిన ప్రాజక్టులను ఇక్కడ ప్రభుత్వం కొనసాగించిందని కేసీఆర్ ప్రభుత్వానికి కితాబు నిచ్చారు. ఇటీవల ప్రధాని మోడీని కలిసినపుడు తన విజన్ వివరించానని అందుకు ఆయనకూడా కన్విన్స్ అయ్యారని చెప్పుకొచ్చారు . జగన్ ప్రభుత్వంపై పెద్దగా దాడి చేయకపోవడం విశేషం .అదే సందర్భంలో తాను ప్రారంభించిన ప్రాజక్టులను జగన్ సర్కార్ రద్దు చేయడం ,పక్కన పెట్టడంపై పరోక్ష విమర్శలు చేశారు . తెలంగాణ అభివృద్ధికి టీడీపీ చేసిన కృషిని గురించి వివరించేందుకే ఎక్కువ సమయం తీసుకున్న చంద్రబాబు చేసిన ప్రసంగం అరిగిపోయిన రికార్డ్ లా ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో అమరావతి , మూడు రాజధానుల అంశం గురించి ప్రస్తావించకపోవడం కూడా ఆశ్చర్య పరిచింది. హైద్రాబాద్ అభివృద్ధి తనవల్లనే జరిగిందని ,ఐటి తీసుకోని వచ్చానని , కనీసం అపాయింట్మెంట్ కూడా ఇచ్చేందుకు ఇష్టంలేని బిల్ గేట్స్ ను హైద్రాబాద్ రప్పించానని, సెల్ ఫోన్ ఎప్పడు వచ్చిందో తెలుసా అని , ఇంజనీరింగ్ కాలేజీలు ,ఏర్పాటు , ఐటి పరిశ్రమ హైద్రాబాద్ లో విస్తరించడానికి తానే కారకుడనని గతంలో చెప్పిన విషయాలనే చెప్పి సభికులకు విసుగు పుట్టించారు .
సభకు ఖమ్మం పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు కూరపాటి వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించగా , టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ , రావుల చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొని ప్రసంగించారు .