బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ’గా మార్చాలంటూ కేసీఆర్ లేఖ!

‘బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ’గా మార్చాలంటూ కేసీఆర్ లేఖ!

  • లోక్ సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ కు లేఖను అందజేసిన ఆ పార్టీ ఎంపీలు
  • వెంటనే స్పందించి అధికారులకు ఆదేశాలు జారీ చేసిన రాజ్యసభ చైర్మన్
  • లోక్ సభ స్పీకర్ కూడా సానుకూలంగా స్పందించారన్న బీఆర్ఎస్ ఎంపీలు 

తెలంగాణ రాష్ట్ర స‌మితి(టీఆర్ఎస్‌).. భార‌త రాష్ట్ర స‌మితి(బీఆర్ఎస్‌)గా పేరు మార్చుకుంది. దీనికి కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా అంగీకారం తెలిపింది. ఈ నేపథ్యంలో పార్లమెంటు ఉభయ సభల్లోనూ టీఆర్ఎస్‌ పార్లమెంటరీ పార్టీ పేరును బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీగా మార్చాలని ఆ పార్టీ ఎంపీలు కోరారు. ఈ మేరకు రాజ్యసభ చైర్మన్ జగదీప్ దన్ ఖడ్, లోకసభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి విజ్ణప్తి చేశారు. ఈ విషయమై తమ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ రాసిన లేఖను ఎంపీలు వారికి అంద‌జేశారు. లోక్‌స‌భలో బీఆర్ఎస్ ఫ్లోర్‌లీడ‌ర్‌ నామా నాగేశ్వ‌ర‌రావు, రాజ్య‌స‌భ ఫ్లోర్ లీడ‌ర్ కే కేశ‌వ‌రావుతో పాటు ఇత‌ర ఎంపీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కాగా, ఎంపీలు చేసిన‌ విజ్ఞప్తికి రాజ్యసభ ఛైర్మన్ జ‌గ‌దీప్ ద‌న్ ఖడ్ వెంటనే స్పందించారు. పార్టీ పేరును ఇకపై బీఆర్ ఎస్ గా మార్చాలని అధికారులను ఛైర్మన్ ఆదేశించారు. తమ విజ్ఞప్తిపై లోకసభ స్పీకర్ ఓం బిర్లా కూడా సానుకూలంగా స్పందించారని, పార్టీ పేరు మార్పును పరిశీలించి నిర్ణయం తీసుకుంటాన‌ని హామీ ఇచ్చారని ఎంపీలు తెలిపారు.

Leave a Reply

%d bloggers like this: