టాలీవుడ్ లో మరో విషాదం …కైకాల ఇక లేరు …ప్రముఖుల సంతాపం …

కైకాల సత్యనారాయణ ఇక లేరు.. అనారోగ్యంతో కన్నుమూసిన సీనియర్ నటుడు…
-గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సత్యనారాయణ
-కృష్ణా జిల్లా కౌతవరంలో 1935లో జననం
-నటనపై ఆసక్తితో కాలేజీ రోజుల్లోనే ప్రదర్శనలు
-‘సిపాయి కూతురు’ సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమలోకి

గత కొంతకాలంగా అస్వస్థతతో బాధపడుతున్న సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన వయసు 87 సంవత్సరాలు. కైకాల మృతితో తెలుగు చిత్రపరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నారు.

కృష్ణా జిల్లా కౌతవరం గ్రామంలో 1935లో జన్మించిన సత్యనారాయణ గుడివాడ కాలేజీలో గ్రాడ్యుయేషన్ చేశారు. నటనపై ఆసక్తితో కాలేజీ రోజుల్లోనే ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. ప్రముఖ నిర్మాత డీఎల్ నారాయణ ఆయనలోని ప్రతిభను గుర్తించి తొలిసారి ‘సిపాయి కూతురు’ సినిమాలో అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత పౌరాణిక, జానపద, కమర్షియల్ సినిమాల్లో హీరోగా, విలన్‌గా నటించి అగ్రనటుల్లో ఒకరిగా ఎదిగారు.

ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్‌బాబుతోపాటు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ వంటి నటులతోనూ సత్యనారాయణ నటించారు. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో సత్యనారాయణ అంత్యక్రియలు రేపు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.

రాజకీయాల్లో ఎక్కువ కాలం ఇమడలేకపోయిన కైకాల

యమధర్మరాజు, దుర్యోధనుడు, ఘటోత్కచుడు వంటి పౌరాణిక పాత్రల్లో ఒదిగిపోయారు. సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ కైకాల అడుగు పెట్టారు. దివంగత ఎన్టీఆర్ తో సన్నిహితంగా ఉన్న ఆయన తెలుగు దేశం పార్టీలో చేరి పార్లమెంట్ కు ప్రాతినిధ్యం వహించారు. 1996లో ఆంధ్రప్రదేశ్ లోని మచిలీపట్నం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేశారు. 81 వేల ఓట్ల తేడాతో కాంగ్రెస్ కు చెందిన కొలుసు పెద రెడ్డయ్య యాదవ్ పై ఘన విజయం సాధించారు. రెండేళ్ల తర్వాత లోక్ సభకు మళ్లీ ఎన్నికలు జరగ్గా మరో పర్యాయం పోటీ చేశారు. కానీ, 1998లో కావూరి సాంబశివరావు చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే, చిత్ర పరిశ్రమతో పాటు ఇటు రాజకీయాల్లోనూ సత్యనారాయణ ఎలాంటి వివాదాల్లో తలదూర్చలేదు.

కైకాల సత్యనారాయణ మృతి పట్ల సంతాపాన్ని ప్రకటించిన జగన్, మహేశ్ బాబు

తెలుగు వారు గర్వించదగ్గ సినీ నటుడు కైకాల సత్యనారాయణ ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బహుముఖ కళాకారుడు, పార్లమెంటు మాజీ సభ్యుడు కైకాల సత్యనారాయణ మృతి పట్ల ముఖ్యమంత్రి జగన్ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ‘గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి కైకాల సత్యనారాయణ గారు. నటునిగా సుదీర్ఘ కాలం సేవలందించి ఎన్నో మరపురాని పాత్రలతో మెప్పించారు. ఎంపీగానూ ప్రజలకు మరింత దగ్గరయ్యారు. కైకాల మరణం తెలుగు ప్రజలకు తీరని లోటు. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని ట్వీట్ చేశారు.

టాలీవుడ్ స్టార్ మహేశ్ బాబు కూడా ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. కైకాల సత్యనారాయణగారి మృతి కలచివేస్తోందని మహేశ్ అన్నారు. ఆయనతో కలిసి నటించినప్పటి ఎన్నో మధుర జ్ఞాపకాలు తనకు ఉన్నాయని చెప్పారు. ఆయన మృతి తీరని లోటు అని అన్నారు. సత్యనారాయణగారి కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని ట్వీట్ చేశారు.

నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ మరణం విచారకరం: చంద్రబాబు, నారా లోకేశ్

తెలుగు సినీ పరిశ్రమలో మరో లెజెండ్ కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. ఇటీవలి కాలంలో కృష్ణంరాజు, కృష్ణలను కోల్పోయి తీవ్ర విషాదంలో మునిగిపోయిన టాలీవుడ్ సత్యనారాయణ మరణవార్తతో షాక్ కు గురైంది. ఆయన మృతికి సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపాన్ని తెలుపుతున్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు సత్యనారాయణ మృతి పట్ల తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ… విభిన్న పాత్రల్లో నటించి, తన విలక్షణ నటన ద్వారా అభిమానుల చేత నవరస నటనా సార్వభౌమ అనిపించుకున్న మేటీ నటులు, టీడీపీ మాజీ పార్లమెంటు సభ్యులు కైకాల సత్యనారాయణ గారి మరణం విచారకరం. సత్యనారాయణగారి ఆరు దశాబ్దాల సినీ జీవితంలో ఎన్టీఆర్ తో ఆయనకున్న అనుబంధం సొంత అన్నదమ్ముల కన్నా ఎక్కువ అని చెప్పారు.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందిస్తూ.. ‘సీనియర్ నటులు, మాజీ ఎంపీ, నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ మృతి విచారకరం. విలక్షణ నటనతో విభిన్న పాత్రలకు జీవం పోసిన ఆయన మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు. వారి ఆత్మకు శాంతి కలగాలని దేవుడ్ని ప్రార్థిస్తూ… వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’ అని ట్వీట్ చేశారు.

ఆహార్యం, అభినయం, ఆంగికాల కలబోత కైకాల నటన: బాలకృష్ణ

నట దిగ్గజం కైకాల సత్యనారాయణ మృతిపై సినీనటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఆహార్యం, అభినయం, ఆంగికాలతో అశేషాభిమానుల్ని సంపాదించుకున్న సీనియర్ నటుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి కైకాల సత్యనారాయణ మరణం చిత్ర పరిశ్రమతోపాటు, తెలుగువారికి తీరనిలోటు అని ఆయన అన్నారు. తెలుగు సినీ వినీలాకాశం ఒక గొప్ప ధ్రువతారను కోల్పోవడం విచారకరమని చెప్పారు. ఎన్టీఆర్ వంటి మహానుభావుడితో కలిసి సాంఘిక, పౌరాణిక, జానపద చిత్రాల్లో కైకాల చూపిన అభినయం ఎన్నటికీ మరువలేనిదని కొనియాడారు. సత్యనారాయణగారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబసభ్యులకు, వారి అభిమానులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని బాలకృష్ణ అన్నారు.

 

Leave a Reply

%d bloggers like this: