ఢిల్లీలోకి ప్రవేశించిన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర!

ఓవైపు కరోనాపై బీజేపీ వర్సెస్ కాంగ్రెస్.. మరోవైపు ఢిల్లీలోకి ప్రవేశించిన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర!

  • ఈ ఉదయం ఢిల్లీలోకి ప్రవేశించిన భారత్ జోడో యాత్ర
  • ఈరోజు ఎర్రకోట వద్ద యాత్రకు తాత్కాలిక విరామం
  • మళ్లీ జనవరి 3న ప్రారంభం కానున్న యాత్ర

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఈ ఉదయం ఢిల్లీలోకి ప్రవేశించింది. ఫరీదాబాద్ నుంచి దేశ రాజధానిలోకి ప్రవేశిస్తున్న రాహుల్, ఇతర నేతలకు ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అనిల్ ఛౌదరి, ఇతర నేతలు, పార్టీ వర్కర్లు ఘన స్వాగతం పలికారు. రాహుల్ తో పాటు భూపీందర్ సింగ్ హుడా, కుమారి షెల్జా, రణదీప్ సూర్జేవాలా, పవణ్ ఖేరా వంటి నేతలు ఢిల్లీలో అడుగుపెట్టారు.

ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ, ఇప్పుడు మన దేశంలోని సామాన్యులు ప్రేమాభిమానాల గురించి మాట్లాడుకుంటున్నారని చెప్పారు. ప్రతి రాష్ట్రంలో భారత్ జోడో యాత్రలో లక్షలాది మంది పాల్గొన్నారని తెలిపారు. బీజేపీకి చెందిన విద్వేషం అనే మార్కెట్లో ప్రేమ అనే దుకాణాన్ని తెరిచామంటూ బీజేపీ, ఆరెస్సెస్ వాళ్లకు చెప్పామని అన్నారు. బీజేపీ, ఆరెస్సెస్ ద్వేషాన్ని వ్యాపింపచేస్తే… కాంగ్రెస్ పార్టీ ప్రేమను వ్యాపింపచేస్తుందని చెప్పారు.

మరోవైపు భారత్ జోడో యాత్రలో కరోనా ప్రొటోకాల్ పాటించాలంటూ రాహుల్ గాంధీకి కేంద్ర ఆరోగ్య మంత్రి మన్ సుఖ్ మాండవీయ లేఖ రాశారు. దీనిపై కాంగ్రెస్ శ్రేణులు మండిపడ్డాయి. గుజరాత్ లో ప్రధాని మోదీ నిర్వహించిన ఎన్నికల ప్రచారం, రాజస్థాన్ లో బీజేపీ నిర్వహించిన జన్ ఆక్రోశ్ యాత్ర గురించి రాహుల్ గాంధీ లేవనెత్తారు. ప్రతి రాష్ట్రంలో బీజేపీ యాత్రలను నిర్వహిస్తోందని… కానీ కేంద్ర ఆరోగ్యమంత్రి మాత్రం తమకే లేఖలు రాస్తారని ఎద్దేవా చేశారు.

భారత్ జోడో యాత్ర డిసెంబర్ 16న వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈరోజు ఢిల్లీలోని మధుర రోడ్, ఇండియా గేట్ మీదుగా యాత్ర కొనసాగుతుంది. ఎర్రకోట వద్ద యాత్రకు తాత్కాలికంగా బ్రేక్ ఇస్తారు. 2022 సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో తొమ్మిది రోజుల పాటు ఇయర్ ఎండ్ బ్రేక్ తీసుకోనున్నారు. తిరిగి జనవరి 3న యాత్ర ప్రారంభమవుతుంది.

Leave a Reply

%d bloggers like this: