వినియోగదారులూ.. హక్కులు తెలుసుకోండి!

వినియోగదారులూ..  హక్కులు తెలుసుకోండి!

  • నేడు జాతీయ వినియోగదారుల దినోత్సవం
  • వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తి, సేవలను పొందే హక్కు
  • నష్టపోతే, మోసపోతే పోరాడేందుకు వినియోగదారుల కమిషన్లు

ఉత్పత్తి కానీయండి. సేవ కానీయండి.. వినియోగించుకునే వారికి కొన్ని హక్కులు ఉన్నాయి. ఈ హక్కుల పరిరక్షణకు నిబంధనలు, చట్టాలున్నాయి. వివాదం ఏర్పడితే పరిష్కరించడానికి ప్రత్యేకంగా వినియోగదారుల కమిషన్ (కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెస్సల్ కమిషన్ ) లు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఉన్నాయి. కనుక ప్రతి వినియోగదారుడు తన హక్కులకు నష్టం కలిగినప్పుడు, తాను మోసపోయినప్పుడు చట్టం పరిధిలో పోరాడేందుకు తగిన వ్యవస్థలు అమల్లో ఉన్నాయి. ‘నేషనల్ కన్జ్యూమర్ డే’ సందర్భంగా వీటి గురించి తెలుసుకుందాం.

హక్కులు..

  • ఉత్పత్తులు, సేవలకు సంబంధించి వినియోగదారుడి భద్రతకు భరోసా ఇవ్వాలి. అంటే వినియోగించే వారికి హాని కలిగించకూడదు.
  • తనకు నచ్చినది ఎంపిక చేసుకునే హక్కు కూడా వినియోగదారుడికి ఉంటుంది.
  • వినియోగదారులకు సమాచార హక్కు కూడా ఉంటుంది. ఉత్పత్తి, సేవకు సంబంధించి  సంపూర్ణ సమాచారాన్ని వినియోగదారుడు కోరితే అందించాలి.
  • తన హక్కుల గురించి తెలుసుకునే హక్కు కూడా ఉంటుంది.
  • భారతీయ ప్రమాణాల సంస్థ, ఇతర చట్టాల్లోని నిబంధనలకు అనుగుణంగా విక్రయించే ఉత్పత్తి, సేవల నాణ్యతకు భరోసా ఇవ్వాలి.
  • నాసిరకం ఉత్పత్తి, నాసిరకం సేవల నుంచి వినియోగదారుడికి రక్షణ ఉంటుంది. నాణ్యత లేని ఉత్పత్తి, సేవల వల్ల నష్టం కలిగితే పరిహారాన్ని వినియోగదారులు కోరొచ్చు.

జాతీయ వినియోగదారుల దినోత్సవం
 1986 డిసెంబర్ 24న ‘వినియోగదారుల పరిరక్షణ చట్టం, 1986’ అమల్లోకి వచ్చింది. అందుకే ఈ రోజును నేషనల్ కన్జ్యూమర్ డేగా నిర్వహిస్తారు. అనంతరం చట్టానికి పలు సవరణలు జరిగాయి. నూతన కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 చట్టాన్ని కేంద్ర సర్కారు 2020 జులై 20 నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. అసలు వినియోగదారులు ఎవరు? అంటే.. ఉత్పత్తి లేదా సేవను కొనుగోలు చేసి వినియోగించే వారిని వినియోగదారులుగా పేర్కొంటోంది చట్టం.

మోసపోతే..
ఏదేనీ సేవ లేదా ఉత్పత్తి వల్ల వినియోగదారుడు నష్టపోతే చట్టం పరిధిలో న్యాయం కోరొచ్చు. కొనుగోలు వ్యయం రూ. కోటి వరకు ఉండే సదరు లావాదేవీలపై జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ లో పిటిషన్ దాఖలు చేసుకోవాలి. రూ.కోటికి పైన రూ.10 కోట్ల వరకు ఉన్నవి అయితే రాష్ట్ర కమిషన్ వద్ద, అంతకుమించిన విలువైన వాటిపై జాతీయ కమిషన్ లో ఫిర్యాదులు దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది. కేసు ఎలా దాఖలు చేయాలనే విషయంలో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ సాయాన్ని పొందొచ్చు. ఆన్ లైన్, ఆఫ్ లైన్ లోనూ ఫిర్యాదులు దాఖలు చేసుకునే సదుపాయం ఉంది. జిల్లా స్థాయిలో కమిషన్ తీర్పుపై సంతృప్తి చెందని వారు దానిపై రాష్ట్ర స్థాయిలో అప్పీల్ చేసుకోవచ్చు.

వీటిని పాటించాల్సిందే
ఫలానా వస్తువు, లేదా సేవ వల్ల నష్టపోయానంటూ వినియోగదారుడు ఫిర్యాదు దాఖలు చేస్తే సరిపోదు. అందుకు ఆధారాలను సమర్పించాల్సి ఉంటుంది. అందుకని ప్రతి కొనుగోలుకు చట్టపరంగా చెల్లుబాటయ్యే బిల్లును పొందాలి. ఈ బిల్లుపై ప్రభుత్వ రిజిస్ట్రేషన్ నంబర్ విధిగా ఉండాలి. పన్నుల చెల్లింపునకు సంబంధించి జీఎస్టీ నంబర్లు ఉండాలి. వారంటీ/గ్యారంటీ కార్డు పొందాలి. విక్రేత సంతకం విధిగా ఉండాలి. కొనుగోలు చేసే ఉత్పత్తులపై తయారీ తేదీ, తయారీ సంస్థ పేరు, చిరునామా ఉన్నాయా? అన్నది పరిశీలించుకోవాలి. ఇవన్నీ ఉన్నప్పుడే చట్టపరంగా పోరాడగలరు. పేరు, ఊరు, బ్యాచ్ నంబర్, తయారీ తేదీ వివరాలు లేని ఉత్పత్తులను, చట్టం పరిధిలో నమోదు కాని వ్యాపారి నుంచి కొనుగోలు చేసి నష్టపోతే, న్యాయం పొందడం కష్టమవుతుంది.

Leave a Reply

%d bloggers like this: