జోడో యాత్రలో రాహుల్ భద్రతపై కాంగ్రెస్ ఆందోళన!

జోడో యాత్రలో రాహుల్ భద్రతపై కాంగ్రెస్ ఆందోళన!

  • ఢిల్లీలో భద్రతా ఉల్లంఘనలు జరిగాయన్న కాంగ్రెస్   
  • ఢిల్లీ పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని ఆరోపణ
  • తమ నేతకు పూర్తి భద్రత కల్పించాలని అమిత్ షాకు లేఖ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సరైన భద్రత కల్పించాలని ఆ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. రాహుల్ నిర్వహిస్తున్న ‘భారత్ జోడో యాత్ర’ భద్రతలో పలు ఉల్లంఘనలు జరిగాయని, రాహుల్‌ కు సరైన రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాసింది. ఈ శనివారం ఢిల్లీలోకి ప్రవేశించిన తర్వాత యాత్ర భద్రతపై పలుమార్లు రాజీ పడ్డారని హోంమంత్రికి రాసిన లేఖలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ పేర్కొన్నారు.

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చే ఢిల్లీ పోలీసులు భారీగా వస్తున్న జనాన్ని నియంత్రించడంలో విఫలం అయ్యారని చెప్పారు. అలాగే, రాహుల్ కు కేటాయించిన జడ్ ప్లస్ భద్రతను నిర్వహించడంలోనూ పూర్తిగా విఫలమయ్యారని లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు, రాహుల్ తో కలిసి నడిచే వారే భద్రతా వలయాన్ని ఏర్పాటు చేయవలసి వచ్చిందన్నారు.

భద్రత ఉల్లంఘన జరిగినా ఢిల్లీ పోలీసులు మౌన ప్రేక్షకులుగా మిగిలిపోయారని విమర్శించారు. మరోవైపు యాత్రలో పాల్గొన్న వ్యక్తులను ఇంటెలిజెన్స్ బ్యూరో విచారిస్తున్నదని ప్రతిపక్ష పార్టీ ఆరోపించింది. హర్యానాలోని గుర్గావ్‌లో పార్టీ దాఖలు చేసిన పోలీసు ఫిర్యాదును కూడా వేణుగోపాల్ ఉదహరించారు. హర్యానా రాష్ట్ర ఇంటెలిజెన్స్‌కు చెందిన గుర్తు తెలియని వ్యక్తులు భారత్ జోడో యాత్ర కంటైనర్‌లలోకి అక్రమంగా ప్రవేశించారని చెప్పారు.

కాగా, హర్యానాలో సంకీర్ణ ప్రభుత్వానికి బీజేపీ నాయకత్వం వహిస్తోంది. భారత భూభాగం అంతటా తిరిగేందుకు ప్రతి పౌరుడికి రాజ్యాంగ హక్కు ఉందని లేఖలో వేణుగోపాల్ పేర్కొన్నారు. ‘భారత్ జోడో యాత్ర దేశంలో శాంతి, సామరస్యాన్ని తీసుకురావడానికి చేపట్టిన పాదయాత్ర. ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలకు పాల్పడకూడదు, కాంగ్రెస్ నాయకుల భద్రతపై రాజీ పడకూడదు’ అని పేర్కొన్నారు. యాత్ర సున్నితమైన పంజాబ్ మరియు జమ్మూ కశ్మీర్‌లోకి ప్రవేశిస్తున్నందున రాహుల్ గాంధీకి మెరుగైన భద్రతను కల్పించాలని పార్టీ కోరింది.

Leave a Reply

%d bloggers like this: