నేను ప్రజలు ఎన్నుకున్న సీఎంని.. నీవెవరు?: కేజ్రీవాల్ ఫైర్

నేను ప్రజలు ఎన్నుకున్న సీఎంని.. నీవెవరు?: కేజ్రీవాల్ ఫైర్

  • ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ పై కేజ్రీవాల్ ఫైర్
  • టీచర్ల బృందాన్ని ఫిన్లాండ్ కు పంపించాలనే నిర్ణయాన్ని అడ్డుకున్న ఎల్జీ
  • తమ నిర్ణయాలను ఆపే అధికారం ఎల్జీకి లేదన్న కేజ్రీ

ఢిల్లీ లెఫ్టినెంట్ జనరల్ వీకే సక్సేనాపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ఢిల్లీకి చెందిన కొందరు టీచర్లను ఫిన్లాండ్ టూర్ కి పంపించాలనే ఢిల్లీ ప్రభుత్వ (ఆప్ ప్రభుత్వం) నిర్ణయాన్ని సక్సేనా అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై కేజ్రీ మండిపడ్డారు. తమ నిర్ణయాన్ని అడ్డుకోవడానికి లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మన తలలపై కూర్చున్న ఈ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరని కేజ్రీ ప్రశ్నించారు.

మన పిల్లలు ఏం చదవాలి, ఎలా చదవాలి అని చెప్పడానికి ఈయన ఎవరని కేజ్రీ మండిపడ్డారు. మన పిల్లలు చదువుకోకూడదనేది వీరి ఆలోచన అని విమర్శించారు. తమను, తమ నిర్ణయాలను ఆపే అధికారం ఎల్జీకి లేదని అన్నారు. జీవితంలో ఏదీ కూడా శాశ్వతం కాదని, రేపొద్దున కేంద్రంలో తాము ఉండొచ్చని చెప్పారు. అప్పుడు ఇదే లెఫ్టినెంట్ గవర్నర్ తమతో ఉండొచ్చేమోనని అన్నారు. తన హోం వర్క్ ని తమ టీచర్లు ఎప్పుడూ చెక్ చేయలేదని… కానీ ఈ లెఫ్టినెంట్ గవర్నర్ మాత్రం తన హోంవర్క్ లోని స్పెల్లింగులు, హ్యాండ్ రైటింగ్ అన్నీ చెక్ చేయడమే పనిగా పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. ఈయన తనకు హెడ్ మాస్టర్ కాదని ఎద్దేవా చేశారు.

తనను ప్రజలు ఎన్నుకున్నారని, ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి తానని కేజ్రీవాల్ చెప్పారు. మీరు ఎవరని ఎల్జీని ప్రశ్నించారు. తనను రాష్ట్రపతి ఎన్నుకున్నారని లెఫ్టినెంట్ గవర్నర్ చెపుతున్నారని . . బ్రిటీష్ కాలంలో వైస్రాయ్ ని ఎన్నుకున్నట్టా అని ఎద్దేవా చేశారు. ఎల్జీకి పాలించడం చేతకాదని విమర్శించారు. బ్లడీ ఇండియన్స్ మీకు పాలించడం చేతకాదని బ్రిటీష్ వైస్రాయ్ లు అనేవారని  . . ఇప్పుడు బ్లడీ ఢిల్లీ వాలాస్ మీకు పాలించడం చేతకాదని ఎల్జీ అంటున్నాడని దుయ్యబట్టారు. ఢిల్లీ పోలీస్, ల్యాండ్, పబ్లిక్ ఆర్డర్ లపై ఎల్జీకి ఎలాంటి అధికారం లేదని సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసిందని చెప్పారు.

Leave a Reply

%d bloggers like this: