శ్రీనగర్ లాల్ చౌక్ లో రాహుల్ జాతీయ పతాకం ఎగరవేయరు.. కాంగ్రెస్ స్పష్టీకరణ!

శ్రీనగర్ లాల్ చౌక్ లో రాహుల్ జాతీయ పతాకం ఎగరవేయరు.. కాంగ్రెస్ స్పష్టీకరణ!

  • లాల్ చౌక్ లో జెండా ఆవిష్కరణ ఆర్ఎస్ఎస్ అజెండా అని ఆరోపణ
  • అక్కడ ఇప్పటికే భారీ పతాకం రెపరెపలాడుతోందని గుర్తుచేసిన రజిని పాటిల్
  • శ్రీనగర్ లోని పార్టీ కార్యాలయంలో ఎగరవేస్తారని వివరించిన పార్టీ ప్రతినిధి
  • కాంగ్రెస్ వేర్పాటువాద అజెండాలో భాగంగానే అని బీజేపీ విమర్శలు

భారత్ జోడో యాత్ర కశ్మీర్ లోకి అడుగుపెట్టే వేళ ఆ పార్టీ ప్రతినిధి సంచలన ప్రకటన చేశారు. శ్రీనగర్ లోని లాల్ చౌక్ లో మువ్వన్నెల జెండా ఎగరవేసే కార్యక్రమం ఏదీ లేదని తేల్చిచెప్పారు. లాల్ చౌక్ లో జెండా ఎగరవేయడం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అజెండా అని పేర్కొంటూ రాహుల్ గాంధీ అక్కడ జెండా ఎగరవేయరని వివరించారు. ఈమేరకు కాంగ్రెస్ పార్టీ జమ్మూకశ్మీర్ ఏఐసీసీ ప్రతినిధి ఎంపీ రజిని పాటిల్ ఈ వ్యాఖ్యలు చేశారు.

శ్రీనగర్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాహుల్ గాంధీ జెండా ఎగరవేస్తారని పాటిల్ వివరించారు. లాల్ చౌక్ లో త్రివర్ణ పతాకం ఎగరవేయాలనే ఆర్ఎస్ఎస్ అజెండాను తాము విశ్వసించబోమని ఆమె తెలిపారు. లాల్ చౌక్ లో ఇప్పటికే మన జాతీయ పతాకం ఎగురుతోందని గుర్తుచేస్తూ పాటిల్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై దుమారం రేగింది.

పాటిల్ వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది. జాతీయ పతాకం ఎగరవేయడమనేది ఒక అజెండాగా ఎప్పుడు మారిందని ప్రశ్నించింది. కాంగ్రెస్ పార్టీ విజయవంతంగా అమలుచేస్తున్న వేర్పాటువాద అజెండాలో ఇది భాగం కాదా? అంటూ బీజేపీ జమ్మూ కశ్మీర్ అధికార ప్రతినిధి ఠాకూర్ అభిజీత్ జస్రోటియా నిలదీశారు.

Leave a Reply

%d bloggers like this: