ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మోడీనే ప్రధాని …ఇండియాటుడే-సీ ఓటర్ సర్వే!

ఇప్పటికిప్పుడు దేశవ్యాప్తంగా ఎన్నికలు పెడితే ఎవరికి పట్టం కడతారు?: ఇండియాటుడే-సీ ఓటర్ సర్వే ఫలితాలు!

  • మోదీకి 72 శాతం మంది ఆమోదం
  • తొమ్మిదేళ్ల ఎన్డీయే సర్కారు పాలన పట్ల 67 శాతం మందిలో సంతృప్తి
  • కరోనా కట్టడి, రామ మందిర నిర్మాణం, ఆర్టికల్ 370 రద్దు సర్కారు విజయాలు
  •  బీజేపీకి 284..  కాంగ్రెస్ కు 191 స్థానాల అంచనా   

దేశంలో ఇప్పటికీ మోదీ హవాయే నడుస్తోంది. ఇప్పటికిప్పుడు దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహిస్తే ప్రజలు మోదీకే పట్టం కడతారని ఇండియాటుడే-సీఓటర్ నిర్వహించిన ‘మూడ్ ఆఫ్ ద నేషన్ పోల్’ సర్వేలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా బీజేపీ 284 లోక్ సభ స్థానాల్లో విజయం సాధిస్తుందని ఈ సర్వే అంచనా వేసింది. కాంగ్రెస్ కు 191 స్థానాలు వస్తాయట.

ప్రధాని నరేంద్ర మోదీ పనితీరు పట్ల సంతోషంగా ఉన్నామని 72 శాతం మంది ప్రజలు చెప్పారు. పీఎం మోదీ పనితీరు అంశంలోనే ప్రజల అభిప్రాయాలను గమనించినట్టయితే.. 2020 జనవరిలో బాగుందని చెప్పిన వారు 68 శాతం మంది ఉంటే, 2020 ఆగస్ట్ లో 78 శాతం మంది, 2021 జనవరిలో 74 శాతం మంది, 2021 ఆగస్ట్ లో 54 శాతం, 2022 జనవరిలో 63 శాతం మంది, 2022 ఆగస్ట్ లో 66 శాతం మంది, 2023 జనవరిలో 72 శాతం మంది మోదీ పనితీరును మెచ్చుకున్నారు. మధ్యలో 2021 ఆగస్ట్ లో మాత్రం మోదీ పనితీరు పట్ల సానుకూలంగా స్పందించే వారి సంఖ్య తగ్గినట్టు తెలుస్తోంది.

దేశంలోని 67 శాతం మంది ప్రజలు.. మెదీ ఆధ్వర్యంలోని ఎన్డీయే సర్కారు తొమ్మిదేళ్ల పాలన తర్వాత కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. ద్రవ్యోల్బణం, కరోనా మహమ్మారి, మూడేళ్లుగా చైనాతో సరిహద్దు సమస్యలు ఉన్నప్పటికీ ప్రజా వ్యతిరేకతను మోదీ సర్కారు అధిగమించగలిగినట్టు ఈ సర్వే తెలిపింది. ప్రతి ఆరు నెలలకు మూడ్ ఆఫ్ ద నేషన్ పోల్ ను ఇండియాటుడే-సీ ఓటర్ సంస్థలు నిర్వహిస్తూ ఉన్నాయి. దేశవ్యాప్తంగా 1,40,917 మంది ఈ సర్వేలో పాల్గొని అభిప్రాయాలు వెల్లడించారు. అసంతృప్తితో ఉన్నవారు 2022 ఆగస్ట్ లో 37 శాతం మంది ఉంటే, 2023 జనవరిలో వీరి సంఖ్య 18 శాతానికి తగ్గినట్టు ఈ సర్వే తెలిపింది.

కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో మోదీ సర్కారు బాగానే పనిచేసినట్టు 20 శాతం మంది భావిస్తున్నారు. ఆర్టికల్ 370 రద్దు చేయడాన్ని 14 శాతం మంది మెచ్చుకున్నారు. రామమందిర నిర్మాణం పెద్ద విజయంగా 12 శాతం మంది భావిస్తున్నారు. ఎన్డీయే సర్కారు వైఫల్యాల గురించి ప్రశ్నించగా.. ధరల పెరుగుదల అని 25 శాతం మంది చెప్పారు. నిరుద్యోగాన్ని కట్టడి చేయడంలో విఫలమైనట్టు 17 శాతం మంది తెలిపారు. కరోనా కట్టడిలో మోదీ సర్కారు విఫలమైనట్టు 8 శాతం మంది భావిస్తున్నారు.

Leave a Reply

%d bloggers like this: