సుప్రీం తీర్పు వచ్చేవరకు కవిత విచారణకు వెళ్ళరు …లాయర్ భరత్!

ఈడీ విచారణకు ఈరోజు కవిత వెళ్లరు.. సుప్రీం తీర్పు తర్వాతే ఏ నిర్ణయమైనా!: బీఆర్ఎస్ నేత సోమా భరత్

  • కవిత తరఫున ఈడీ ఆఫీసుకు వచ్చిన బీఆర్ఎస్ నేత, న్యాయవాది సోమా భరత్ 
  • కొన్ని డాక్యుమెంట్లను అధికారులకు అందజేసినట్లు వెల్లడి
  • చట్ట ప్రకారం మహిళల్ని ఇంటి దగ్గరే విచారించాలని వ్యాఖ్య
  • అధికారులు చట్టాన్ని ఉల్లంఘించారని ఆరోపణ

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారించడంపై ఢిల్లీలో హైడ్రామా నడుస్తోంది. ఈరోజు రెండో విడత ఈడీ విచారణ జరగాల్సి ఉండగా.. కవిత హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో ఈడీ ఆఫీసుకు కవిత తరఫున బీఆర్ఎస్ నేత, న్యాయవాది సోమా భరత్ చేరుకున్నారు. కవిత తరఫున కొన్ని డాక్యుమెంట్లను ఈడీ అధికారులకు అందజేసినట్లు ఆయన తెలిపారు.

తర్వాత ఢిల్లీలోని ఈడీ ఆఫీసు బయట మీడియాతో సోమా భరత్ మాట్లాడారు. ఇవాళ ఎట్టిపరిస్థితుల్లోనూ ఈడీ ఎదుట విచారణకు కవిత హాజరుకారని స్పష్టంచేశారు. ‘‘బీఆర్ఎస్ పై కేంద్రం కక్షగట్టింది. తప్పుడు కేసులతో కవితను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే అనేక కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు’’ అని ఆరోపించారు. ఇది తప్పుడు కేసు అని, ఇటు చట్టబద్ధంగా, అటు రాజకీయ క్షేత్రంలో ఎదుర్కొంటామని చెప్పారు.

సుప్రీం ఆదేశాలను, చట్టాన్ని ఈడీ అధికారులు ధిక్కరించారని సోమా భరత్ ఆరోపించారు. ‘‘మహిళలను ఇంటి దగ్గర మాత్రమే విచారించాలి. అది కూడా సాయంత్రం 6 గంటల్లోపే విచారణ పూర్తిచేయాలి. కానీ విచారణ సందర్భంగా నిబంధనలను అధికారులు ఉల్లంఘించారు. ఈనెల 11న రాత్రి 8 గంటల వరకు విచారించారు’’ అని చెప్పారు. సెల్ ఫోన్ ను కూడా చట్టానికి వ్యతిరేకంగా స్వాధీనం చేసుకున్నారన్నారు.

ఈడీ విచారణకు కవిత హాజరవ్వాలా? వద్దా? అనే దానిపై సుప్రీం ఆదేశాల ప్రకారమే నడుచుకుంటామని తెలిపారు. ‘‘చట్ట ప్రకారం ఇంటి దగ్గరే విచారణ జరగాలని గతంలోనే కవిత కోరారు. ఇప్పుడు కూడా చట్టపరంగా విచారణ జరగాలని కోరుకున్నారు. అందుకే సుప్రీంకోర్టును ఆశ్రయించాం. ఈ పిటిషన్ పై ఈనెల 24న విచారణ జరుగుతుంది’’ అని వివరించారు.

‘‘ఈడీ విచారణకు కవిత హాజరుకాకపోవడానికి అనారోగ్యం కారణం కాదు. ఆడవాళ్లను ఇంటి దగ్గరే విచారించాలి. ఇది వారి హక్కు. ఆ హక్కు సాధించుకోవడం కోసం సుప్రీంకోర్టును కవిత ఆశ్రయించారు. కోర్టు ఏం చెప్తే అది చేస్తాం’’ అని స్పష్టం చేశారు.

Leave a Reply

%d bloggers like this: