బండి సంజయ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు

  • టీఎస్ పీఎస్సీలో ప్రశ్నా పత్రాల లీకేజి
  • సిట్టింగ్ జడ్జితో విచారణ కోరుతూ బండి సంజయ్ దీక్ష
  • హైదరాబాద్ గన్ పార్క్ వద్ద ఉద్రిక్తతలు
  • బండి సంజయ్ దీక్షను భగ్నం చేసిన పోలీసులు

టీఎస్ పీఎస్సీ ప్రశ్నా పత్రాల లీకేజి వ్యవహారంలో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ హైదరాబాద్ గన్ పార్క్ వద్ద నిరసన దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. 

అయితే, పోలీసులు బండి సంజయ్ దీక్షను భగ్నం చేశారు. టీఎస్ పీఎస్సీ కార్యాలయానికి ర్యాలీగా బయల్దేరుతున్న సంజయ్ ని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. సంజయ్ తో పాటు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను కూడా పోలీసులు ఈ సందర్భంగా అదుపులోకి తీసుకున్నారు. సంజయ్ అరెస్ట్ సందర్భంగా పోలీసులను బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దాంతో వారి మధ్య తీవ్ర వాగ్యుద్ధం చోటుచేసుకోగా, ఉద్రిక్తత నెలకొంది. 

అటు, అసెంబ్లీ ఎదుట బీజేపీ కార్యకర్తలు బైఠాయించడంతో ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. పోలీసులు బీజేపీ కార్యకర్తలను అక్కడ్నించి తొలగించే ప్రయత్నంలో తోపులాట జరగ్గా, ఓ కార్యకర్త సొమ్మసిల్లి పడిపోయాడు. టీఎస్ పీఎస్సీ చేపట్టిన పలు ఉద్యోగ నియామకాల ప్రశ్నాపత్రాలు ఇటీవల లీక్ కావడం సంచలనం సృష్టించింది. టీఎస్ పీఎస్సీ కార్యదర్శి పీఏ ప్రవీణ్ ఈ లీకేజి వెనుక ప్రధాన సూత్రధారి అని గుర్తించారు.

Leave a Reply

%d bloggers like this: