అమరావతి రాజధాని నిర్మాణంలో భారీ అవినీతి …చంద్రబాబుకు ఐటీ నోటీసులు …అసెంబ్లీ లో సీఎం జగన్

అతడిచ్చిన సమాచారంతోనే చంద్రబాబు పీఏపై ఐటీ దాడులు జరిగాయి: అసెంబ్లీలో సీఎం జగన్

  • అమరావతి నిర్మాణాల్లో భారీ అవినీతి జరిగిందన్న సీఎం జగన్
  • అసెంబ్లీలో ప్రసంగం
  • తొలుత మనోజ్ వాసుదేవ్ పై ఐటీ దాడులు జరిగాయని వెల్లడి
  • చంద్రబాబు పీఏ నుంచి ఎంతో సమాచారం రాబట్టారని వివరణ
  • ఆ తర్వాత చంద్రబాబుకు నోటీసులు పంపారని స్పష్టీకరణ

గత ప్రభుత్వ హయాంలో అమరావతి నిర్మాణాల్లో భారీ అవినీతి జరిగిందని ఏపీ సీఎం జగన్ అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అమరావతి నిర్మాణాల అంశంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రసంగిస్తూ…  షాపూర్ పల్లోంజీ అనే సంస్థ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ అనే వ్యక్తిపై ఐటీ దాడులు జరిగాయని వెల్లడించారు. ఈ దాడులు 2019 నవంబరులో జరిగాయని తెలిపారు. ఆ తర్వాత 2020 ఫిబ్రవరిలో చంద్రబాబు పీఏ శ్రీనివాస్ పై ఐటీ దాడులు జరిగాయని వివరించారు.

“మొదట మనోజ్ వాసుదేవ్ పై దాడులతో కొంత సమాచారం సేకరించిన ఐటీ అధికారులు, శ్రీనివాస్ పై దాడులతో మరింత సమాచారం రాబట్టారు. మొత్తం సమాచారం క్రోడీకరించి అప్రైజల్ రిపోర్ట్ రూపొందించిన నేపథ్యంలో… మనోజ్ వాసుదేవ్ మాట్లాడిన మాటలు, చంద్రబాబు పీఏ శ్రీనివాస్ మాట్లాడిన మాటలు అన్నీ పరిశీలించిన తర్వాత ఇప్పుడు చంద్రబాబుకు కూడా ఐటీ అధికారులు నోటీసులు పంపించారు.

2019 జనవరి, ఫిబ్రవరిలో చంద్రబాబు… మనోజ్ వాసుదేవ్ ను పిలిపించుకున్నారు. తన పీఏ శ్రీనివాస్ ను కలవాలంటూ చంద్రబాబు ఈ సందర్భంగా మనోజ్ కు చెప్పారు. దాంతో మనోజ్ వెళ్లి శ్రీనివాస్ ను కలిశాడు. అప్పటికి రూ.7000 వేల కోట్ల పనులు చేస్తుండగా, అందులో ఐదు శాతం మేర అంటే రూ.143 కోట్లు వసూలు చేసే విధంగా మాట్లాడుకున్నారు.

ఆ తర్వాత శ్రీనివాస్… వినయ్ నంగాలియా, వికీ జైన్ అనే వ్యక్తులను మనోజ్ వాసుదేవ్ కు అనుసంధానం చేశాడు. అనంతరం, వినయ్ నంగాలియా 3 కంపెనీలు, వికీ జైన్ 2 కంపెనీలను తీసుకువచ్చి మనోజ్ వాసుదేవ్ కు అప్పజెప్పారు. ఈ కంపెనీలకు మీరు బోగస్ సబ్ కాంట్రాక్టుల కింద డబ్బులు ఇవ్వండి…. వాళ్లు మాకు డబ్బులు ఇస్తారు అని వాసుదేవ్ కు చెప్పారు” అంటూ సీఎం జగన్ వివరించారు.

మనోజ్ వాసుదేవ్ పై ఐటీ దాడుల్లో సేకరించిన సమాచారం ఆధారంగానే చంద్రబాబు పీఏపై ఐటీ దాడులు జరిగాయని స్పష్టం చేశారు. బోగస్ కంపెనీలతో నిధులు మళ్లించారని, రామోజీరావు కుమారుడి వియ్యంకుడు రఘు కూడా ఇందులో భాగస్వామి అని ఆరోపించారు.

Leave a Reply

%d bloggers like this: