అనకొండకు అడుగు దూరంలో..

అనకొండకు అడుగు దూరంలో.. 

  • బోటులో షికారు చేస్తూ వీడియో రికార్డు చేసిన వ్యక్తి
  • అత్యంత సమీపం నుంచి వెళ్లిన భారీ అనకొండ
  • పాము తల బయటపెట్టకపోవడంతో తప్పిన ప్రమాదం

బోటులో షికారు చేస్తున్నాడో వ్యక్తి.. పచ్చదనంతో కప్పుకుపోయిన నీళ్లతో అక్కడంతా ఆహ్లాదకరంగా ఉంది. ఇంతలో పక్కనే చిన్న అలజడి.. ఏమిటా అని తిరిగి చూస్తే.. ఒక్క క్షణం గుండె ఆగినంత పనైంది అతడికి. బోటు పక్కనే వెళ్తున్న ఆ భారీ ఆకారాన్ని చూసి గతుక్కుమన్నాడు. ఇంతకీ ఆ భారీ ఆకారం ఏంటనుకుంటున్నారా?.. అనకొండ!!

హాలీవుడ్ సినిమాలను తలపించే రీతిలో ఉన్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘వావ్ టెర్రిఫైయింగ్’ అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. ‘‘చక్కని పడవ ప్రయాణాన్ని ఆస్వాదిస్తూ.. ఒక్క నిమిషం ఆగండి..’’ అని క్యాప్షన్ ఇచ్చారు.

అందులో ఓ వ్యక్తి నదిలో బోటుపై వెళ్తున్నారు. తన చుట్టూ ఉన్న పరిసరాలను వీడియో తీస్తున్నారు. అకస్మాత్తుగా అతడికి నీటిలో ఏదో భారీ ఆకారం కనిపించింది. ఆ సమయంలో అతడు తన కెమెరాను అటు వైపు తిప్పాడు. అత్యంత సమీపంలో ఓ భారీ అనకొండ కనిపించింది. ఆ పాము పడవ పక్క నుంచి ముందుకు సాగిపోయింది. తల బయటపెట్టకపోవడంతో అతడు బతికిపోయాడు.

ఈ ఆ వీడియోను ఇప్పటివరకు 1.90 కోట్ల మంది వీక్షించారు. 58 వేల మంది లైక్ చేశారు. కామెంట్ల వర్షం కురుస్తోంది. ‘‘హాలీవుడ్ సినిమాలోని సీన్ చూస్తున్నట్టు ఉంది’’ అని ఒకరు.. ‘‘ఆ వీడియో చూసి చాలా థ్రిల్ ఫీలయ్యా’’ అని ఇంకొకరు.. ‘‘పాపం.. ఆ బోటులో ఉన్న వ్యక్తి ఎంత భయపడి ఉంటాడో’’ అని మరొకరు కామెట్ చేశారు. ‘‘ఇది స్కల్ ఐల్యాండ్ నా ఏంటి? పక్కన కింగ్ కాంగ్ ఉందేమో చూసుకో’’ అంటూ ఓ యూజర్ జోక్ చేశారు.

Leave a Reply

%d bloggers like this: