సీఎం కేసీఆర్ కు జ్వరం …ప్రధాని మోడీ పర్యటనకు దూరం!
-ఇది కేసీఆర్ సంస్కారం అన్న బండి సంజయ్
-ఇటీవలనే ప్రధానిపై విమర్శలు కురిపించిన సీఎం కేసీఆర్
-ఆయన వేష భాషలమీద దాడిచేసిన కేసీఆర్
-టీఆర్ యస్ ,బీజేపీ మధ్య మాటల యుద్ధం
ప్రధాని మోడీ రెండు ప్రధాన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు శనివారం హైద్రాబాద్ వచ్చారు . సాధారణంగా ప్రధాని వస్తున్నప్పుడు ఆ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి పార్టీలకు సంబంధం లేకుండా ప్రోటోకాల్ ప్రకారం స్వాగతం పలకడం ఆయన వెంట పర్యటనల్లో పాల్గొనడం ఆనవాయితీ . కానీ కేసీఆర్ జ్వరం తో బాధపడుతున్నందున ఈ కార్యక్రమానికి హాజరు కావడంలేదని సీఎంఓ కార్యాలయం ప్రకటించింది. అయితే ఇటీవల జరుగుతున్నా పరిణామాల నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ ప్రధానిపై వ్యక్తిగత దూషణలు చేశారని అందువల్లనే ప్రధాని కార్యక్రమాలకు దూరంగా ఉన్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్ కు సంస్కారం లేదని అందువల్లనే సీఎం కేసీఆర్ పర్యటనకు హాజరు కాలేదని , కనీసం ప్రోటోకాల్ ప్రకారం వ్యవహరించలేదని విమర్శించారు .
ఇటీవల కేసీఆర్ బీజేపీ పైన కేంద్ర ప్రభుత్వంపైనా యుద్ధం ప్రకటించారు. వరిధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రానికి రాష్ట్రానికి మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. టీఆర్ యస్ ఎంపీ లు పార్లమెంట్ సమావేశాలని బహిష్కరించారు . బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగాన్ని సైతం టీఆర్ యస్ బాయ్ కట్ చేసింది. రాజ్యాంగాన్ని మార్చాలని దీనిపై చర్చ జరగాలని కేసీఆర్ మీడియా సమావేశంలో పేర్కొనడం దేశవ్యాపితంగా కలకలం రేపింది. దీంతో కేసీఆర్ జ్వరం తో రాకపోవడం తో బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి.
మధ్యాహ్నం చేరుకున్న ప్రధాని మోడీ కి శంషాబాద్ ఎయిర్ పోర్టులో మోదీకి గవర్నర్ తమిళిసై, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, చీఫ్ సెక్రటరీ, డీజీపీలు స్వాగతం పలికారు . ప్రధాని పర్యటన నేపథ్యంలో నగరంలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ పర్యటనలో ఆయన రెండు కార్యక్రమాల్లో పాల్గొన్నారు . ఇక్రిశాట్ 50 ఏళ్ల ఉత్సవాలకు ఆయన హాజరైయ్యారు . అనంతరం సాయంత్రం 5 గంటలకు సమతా మూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు .