- ఇంగ్లండ్ పై 58 పరుగులు సాధించిన కృనాల్
- కెరీర్ తొలి వన్డేలో వేగంగా ఫిఫ్టీ సాధించిన ఆటగాడిగా రికార్డు
- ఈ అర్ధసెంచరీ తండ్రికి అంకితమని ప్రకటన
- ఇటీవలే పాండ్య సోదరుల తండ్రి కన్నుమూత
ఇంగ్లండ్ తో తొలి వన్డే సందర్భంగా టీమిండియా తుదిజట్టులో ఆల్ రౌండర్ కృనాల్ పాండ్య చోటు దక్కించుకున్నాడు. ఇప్పటివరకు టీ20ల్లోనే టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన కృనాల్ కు ఇదే మొదటి వన్డే మ్యాచ్. అయితే, అరంగేట్రంలోనే తన బ్యాటింగ్ పవర్ రుచిచూపిస్తూ కేవలం 31 బంతుల్లోనే 58 పరుగులు సాధించాడు. కృనాల్ అర్ధసెంచరీలో 7 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. కెరీర్ తొలి వన్డేలో అత్యంత వేగంగా అర్ధసెంచరీ సాధించిన ఆటగాడిగా కృనాల్ తన పేరిట వరల్డ్ రికార్డు లిఖించుకున్నాడు.
భారత్ ఇన్నింగ్స్ ముగిశాక చానల్ ప్రతినిధితో మాట్లాడుతూ కృనాల్ తీవ్ర భావోద్వేగాలకు గురయ్యాడు. కన్నీరు ఉబికి వస్తుండగా… ఈ ఫిఫ్టీ తన తండ్రికి అంకితమని ప్రకటించాడు. అనంతరం తన సోదరుడు హార్దిక్ పాండ్య భుజంపై తలవాల్చి కన్నీటిపర్యంతమయ్యాడు. పాండ్య సోదరుల తండ్రి ఇటీవలే మరణించారు. తమ క్రికెట్ అభ్యున్నతికి తండ్రే కారణమని పాండ్య సోదరులు పలు ఇంటర్వ్యూల్లో వెల్లడించారు.