పోరాట పటిమ తగ్గిన కమ్యూనిస్ట్ లు…
– మిలిటెన్సీ తగ్గి మొక్కుబడి ఉద్యమాలకె పరిమితం
-కమ్యూనిస్ట్ పార్టీలలో రిక్రూట్ మెంట్ తగ్గింది
– నాయకత్వం పట్టాలమీదకు ఎక్కించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించటంలేదు
-అన్యవర్గ ధోరణులు పెరిగాయి
-ఫలితంగా బలహీన పడుతున్నారు.
-క్లాస్ స్ట్రగుల్ కాస్త క్యాస్ట్ స్ట్రగుల్ గా మారింది.
కమ్యూనిస్టుల పోరాట పటిమ తగ్గింది …సాయిధరైతాంగా పోరాటవారసులుగా ఉన్న కమ్యూనిస్టులు నేడు బిక్కచచ్చి మొక్కుబడి ఉద్యమాలకు పరిమితమైయ్యారనే విమర్శలు ఉన్నాయి. ఆ పోరాట వారసత్వం ఏమైందని ప్రశ్నలకు జవాబు లేదు. ఒకప్పుడు కమ్యూనిస్ట్ లమని చెప్పుకునేందుకు గర్వపడే వారు ఇప్పుడు మొఖం చాటేస్తున్నారు . కొంత మంది నిబద్దతతో ఉన్నప్పటికీ వారి నిబద్దత ప్రస్తుత వరవడికి సరిపోవడంలేదు. సిద్ధాంతం లో పట్టు ఉన్నా, దాన్ని అమలు చేయటంలో తప్పటడుగులు వేస్తున్నారనే, విమర్శలు ఉన్నాయి. ప్రపంచం అంతా ఇదే తీరుగా ఉన్నా, ప్రత్యేకించి భారత దేశంలో ఒకప్పుడు ప్రత్యాన్మాయ శక్తిగా ఉన్న కమ్యూనిస్టులు నేడు ఉనికి కోసం పాకులాడుతున్నారు.కొన్ని రాష్ట్రాలలో అధికారం చేపట్టి అనేక సంవత్సరాలు పరిపాలించిన తరువాత ప్రజల నుంచి వ్యతిరేకత మూటగట్టుకున్నారు. బెంగాల్ , త్రిపుర రాష్ట్రాలలో అనూహ్య ఓటముల తరువాత మరీ బలహీన పడ్డారు. బెంగాల్ లో ఓటమికి సవాలక్ష కారణాలు ఉన్నా, త్రిపుర లో ఓటమి సిపిఎం పార్టీకి మింగుడు పడని విషయంగా ఉంది. అక్కడ బీజేపీ పాచికలు, డబ్బు రాజకీయాల ముందు సిపిఎం నిలవలేక పోయింది. సిపిఎం వ్యతిరేక శక్తిలన్ని ఏకమైనందున ఓటమికి కారణమైంది . కమ్యూనిస్టులకు స్వతహాగా మంచి పేరుంది.నిక్కచ్చిగా మాట్లాడతారని ,నీతి,నిజాయతీకి మారుపేరని, వారు ఏది చెప్పిన అందులో వాస్తవం లేకుండా మాట్లాడరని , వైరిపక్షాలు సైతం అంగీకరిస్తాయి. పేదలకోసం పోరాడేది కమ్యూనిస్టులని నమ్మకం ఉంది. బడుగు బలహీన వర్గాల పరిరక్షణ కోసం పోరాడేది, వారి పక్షాన నిలబడేది కమ్యూనిస్టులే ననే అభిప్రాయం ఉంది . కాని వారు దాన్ని నెమ్మదిగా కోల్పోతున్నారు. ప్రజలలో ఉన్న పలుకు బడి తగ్గిపోతుంది. వారి ఓటింగ్ శాతం గణనీయంగా పడిపోయింది. . ప్రత్యేకించి సీపీఎంకి పట్టుగొమ్మలుగా ఉన్న బెంగాల్ , త్రిపుర లాంటి రాష్ట్రాలలు అధికారం కోల్పోయారు. ఒక్క కేరళ మినహా కమ్యూనిస్టులకు అధికారం ఉన్న రాష్ట్రం లేదు. క్రమశిక్షణ ఉన్న పార్టీలుగా పేరున్న కమ్యూనిస్టులలో అన్యవర్గ ధోరణులు ప్రబలాయనే విమర్శలు ఉన్నాయి. ఫలితంగా సిద్ధాంతం పట్టుతప్పింది . క్లాస్ స్ట్రగుల్ క్యాస్ట్ స్ట్రగుల్ గా మారి పక్కదార్లు పట్టింది. మిగతా పార్టీలకు భిన్నంగా కమ్యూనిస్టుల వ్యవహార శైలి లేదని ,వారుకూడా భూర్జువపార్టీల లాగానే మారిపోయారనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి . కమ్యూనిస్టులకు స్వంతం స్వార్థం ఉండదనే అభిప్రాయాలూ సన్నగిల్లాయి. వ్యక్తి ప్రయోజనాలే ముఖ్యమైయ్యాయి. స్వార్థం పెరిగి స్వంతం అనే ఆలోచనలు బయలు దేరాయి. వ్యక్తిగత ఆస్తులు కూడబెట్టుకోవటం మొదలైంది. ప్రస్తుతానికి ఆపార్టీలలో ఉన్న కొత్త తరం నాయకత్వం పార్టీని పట్టాలు ఎక్కించేందుకు చేస్తున్న కృషి ఫలించటంలేదు. ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలలోకి వచ్చేందుకు ఆశక్తి చూపిన యువత ఇతర పార్టీల వైపు చూస్తుంది. విద్యార్ధి యువజన ఉద్యమాలు తగ్గాయి. మిలిటెన్సీ లేకుండా పోయింది. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాలలో మొదటి సారిగా చట్ట సభలలో కమ్యూనిస్టుల ప్రాతినిధ్యం లేకుండా ఉండటం చూస్తున్నాం . రెండు రాష్ట్రాలలో ఉన్న మండలిలో ఉపాధ్యాయ ప్రతినిధులు కమ్యూనిస్ట్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నవారు ఉండటం కొంత ఉపశమనం . కమ్యూనిస్టుల ప్రాతినిధ్యం లేకపోవటం పేద ప్రజలకు ప్రజా ఉద్యమాలకు లోటుగానే ఉంది. దేశంలోని కీలకంగా ఉన్న హిందీ రాష్ట్రాలలో కమ్యూనిస్టుల ఉనికి లేదు.ఒకప్పుడు బీహార్ లాంటి రాష్ట్రాలలో సిపిఐ గణనీయమైన ఓటింగ్ కలిగి ప్రధాన ప్రతిపక్షంగా ఉండేది . ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సైతం 1957 ఎన్నికల్లో కమ్యూనిస్టులు అధికారంలోకి వస్తున్నారనే ప్రచారం జరిగింది. తరువాత కాలంలో కమ్యూనిస్టుల ప్రాబల్యం తగ్గింది. తిరిగి కమ్యూనిస్టులు పుంజుకుంటున్నారని అనుకుంటున్న సమయంలో ఎన్టీఆర్ 1983 లో రాజకీయ రంగ ప్రవేశం జరిగింది. పార్టీ పెట్టిన 9 నెలలోనే ఎన్టీఆర్ సునామి సృష్టించి 1983 ఎన్నికలలో అఖండ మెజార్టీ తో అధికారంలోకి వచ్చారు. కాంగ్రెస్ గుత్తాధిపత్యానికి బ్రేక్ పడింది. ప్రజలు కాంగ్రెస్ వ్యతిరేకంగా ఎన్టీఆర్ ను చూశారు. కమ్యూనిస్టులు ఇతర పార్టీలు బలహీన పడ్డాయి.తరువాత కాలంలో ఎన్టీఆర్ తెలుగుదేశం తో పొత్తు పొట్టుకొని కొంత నష్టపోయారు. అప్పటినుంచి ఇప్పటివరకు ఎదో ఒకపార్టీతో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్లడంతో పార్టీ శ్రేణులు ఆలోచనలో పడ్డాయి. డబ్బు రాజకీయాలు ప్రధానమైయ్యాయి. ఆజబ్బు కమ్యూనిస్టులకు కూడా అంటింది. ఫలితంగా కొంత మంది కమ్యూనిస్ట్ పార్టీని వీడి తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. తరువాత కాలంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వచ్చింది. సిపిఐ, సిపిఐ ఎం ఎల్ న్యూ డెమోక్రసీ లాంటి పార్టీలు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని బలపరచగా , సిపిఎం దాన్ని వ్యతిరేకించింది. తెలంగాణ ఉద్యమాన్ని బలపరిచిన సిపిఐ కి గాని వ్యతిరేకించిన సిపిఎం కు గాని 2014 ఎన్నికల్లో ఆంధ్రాలో ఒక్క సీటు గెలవలేదు. తెలంగాణలో మాత్రం సిపిఎం, సిపిఐ చెరొక సీట్లో గెలిచాయి. సిపిఐ నుంచి గెలిచిన రవీంద్ర నాయక్, అధికార టీఆర్ యస్ తీర్థం పుచ్చుకున్నారు. 2018 ,2019 లలో తెలంగాణ ,ఆంధ్రప్రదేశ్ లలో జరిగిన ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీల ప్రాతినిధ్యం లేకపోవటంతో కార్మిక , కర్షక ,యువజన, విద్యార్థులు , ఉద్యోగుల తరుపున వినిపించే గొంతులేకుండా పోయింది.లెఫ్ట్ బలహీన పడటం నిజంగా ప్రజా ఉద్యమాలకు తీరని నష్టమే అనటంలో ఎలాంటి సందేహంలేదు.
previous post
next post