మంత్రిపదవులపై రగులుతున్న ఏపీ … ఎమ్మెల్యే పదవికి సుచరిత రాజీనామా!
-మంత్రి పదవి రాలేదని విలపించిన కోటంరెడ్డి…అలక భూనిన బాలినేని
-అసంతృప్తితో బయటకు రాని పిన్నెల్లి …ఉదయభాను అభిమానుల ఆందోళన
-పార్థసారథి అభిమానుల ఆగ్రహజ్వాలలు
-అదే బాటలో మరికొందరు ఎమ్మెల్యేలు
-పలుచోట్ల ఆందోళనలు
-ఏపీలో కొత్త మంత్రివర్గం ఖరారు
-25 మందితో జాబితా
-పలువురు వైసీపీ ఎమ్మెల్యేలకు తీవ్ర నిరాశ
ఇప్పటివరకు క్రమశిక్షణగా ఉంటుందనుకున్న వైసీపీ లో కట్టుతప్పింది. సీఎం జగన్ మంత్రువర్గంలో మార్పులకు సిద్ధపడిన వేళ రాజీనామాలను ఇచ్చిన మంత్రుల్లో కొందరు తమకు మంత్రి పదవి ఇవ్వకపోవడంపై రగిలి పోతున్నారు. పాత మంత్రుల్లో కొందరికి ఇచ్చి తమకు ఇవ్వకపోవడంపై అవమానంగా భావిస్తున్నారు . తాము ఏమి తప్పు చేశామని పక్కన పెట్టారని నిలదీస్తున్నారు. మాజీ హోమ్ మంత్రి మేకతోటి సుచరిత ఎమ్మెల్యే పదవికి స్పీకర్ ఫార్మెట్లోనే రాజీనామా చేస్తున్నట్లు ఆమె కుమార్తె ప్రకటించడం విశేషం . మేకతోటి సుచరితను బుజ్జగించేందుకు వచ్చిన మోపిదేవి వెంకటరమణ కు స్పీకర్ ఫార్మేట్ లోనే రాజీనామా లేఖ అందజేశారు . అయితే తన తల్లి పార్టీ కి రాజీనామా చేయడంలేదని కూతురు చెప్పారు .
కచ్చితంగా మంత్రి పదవి లభిస్తుందని ఆశించిన వారిలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒకరు. కానీ, ఇవాళ ఖరారైన ఏపీ నూతన క్యాబినెట్ జాబితాలో కోటంరెడ్డి పేరు లేదు. దాంతో ఆయన కన్నీరు పెట్టుకున్నారు. తనకు మంత్రి పదవి దక్కలేదని, వైసీపీ నేతలు, కార్పొరేటర్లు ఎవరూ రాజీనామాలు చేయొద్దని సూచించారు. వైసీపీ కార్యకర్తలు, నేతలు తమ రక్తాన్నే చెమటగా మార్చి తనను రెండుసార్లు గెలిపించారని, పార్టీ కోసం మొదటి నుంచి పనిచేస్తున్నానని కోటంరెడ్డి వివరించారు. మంత్రి పదవి రాలేదన్న బాధ ఉందంటూ భావోద్వేగాలు వ్యక్తం చేశారు.
కాగా, మంత్రిపదవి వస్తుందని ఆశించి, నిరాశకు గురైన వైసీపీ ఎమ్మెల్యేల అనుచరులు పలు ప్రాంతాల్లో నిరసనలు వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో సామినేని ఉదయభాను మద్దతుదారులు జాతీయ రహదారిపై టైర్లు దగ్ధం చేశారు. అంతేకాదు, ఓ ద్విచక్రవాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ క్రమంలో ఇద్దరు కార్యకర్తలకు మంటలు అంటుకోగా, కొద్దిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
అటు, పల్నాడులోనూ నిరసనజ్వాలలు భగ్గుమన్నాయి. నాలుగు పర్యాయాలు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మంత్రి పదవి దక్కకపోవడంతో ఆయన అనుచరగణం ఆగ్రహావేశాలు వ్యక్తం చేసింది. పదవులకు రాజీనామా చేస్తామంటూ మాచర్ల మున్సిపల్ చైర్మన్ కిశోర్ తో పాటు పెద్ద సంఖ్యలో వైసీపీ ప్రజాప్రతినిధులు ముందుకొచ్చారు.
ఏపీ కొత్త క్యాబినెట్ జాబితాలో తన పేరు లేదని తెలుసుకున్న పిన్నెల్లి తన నివాసానికే పరిమితమయ్యారు. ఎవరినీ కలవడానికి ఆయన ఆసక్తి చూపలేదు. ఇక, విజయవాడలో పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి మద్దతుదారులు నిరసనకు దిగారు. అయితే, పార్టీ కోసం పనిచేద్దామంటూ పార్థసారథి వారికి నచ్చచెప్పారు. మరికొన్ని చోట్ల కూడా మంత్రి పదవి ఆశించి రానివారు అసంతృప్తితో ఉన్నారు . కొందరికి క్యాబినెట్ రాంక్ పదవులు ఇవ్వడం ద్వారా వారిని బుజ్జగించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ ముఖ్యసలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణ రెడ్డి అసమ్మతినేతలతో సమావేశమైయ్యారు . ప్రధానంగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి తో ఆయన రెండు సార్లు భేటీ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకున్నది . మిగతావారిని కూడా ఆయా జిల్లాల నేతలతో అసంతృప్తి చల్లారెచ్చే పనిలో నేతలు ఉన్నారు . ముందు ముందు వైసీపీలో ఏమి జరుగుతుందో చూద్దాం ….