Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వాసుపత్రిలో దారుణం.. మూడు రోజుల పసికందును కరిచిన ఎలుకలు!

ప్రభుత్వాసుపత్రిలో దారుణం.. మూడు రోజుల పసికందును కరిచిన ఎలుకలు!

  • ఝార్ఖండ్ లోని గిరిధ్ లో దారుణ ఘటన
  • మోకాలికి లోతైన గాయం
  • మెరుగైన చికిత్స కోసం ప్రైవేటుకు తరలింపు
  • ఈ నెల 2న ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి

పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో పెట్టిన ప్రభుత్వాసుపత్రులు.. ఆ లక్ష్యాన్ని అందుకోవట్లేదు. అక్కడి పరిస్థితులు నానాటికీ తీసికట్టుగా మారుతున్నాయి. మౌలిక వసతుల మాట దేవుడెరుగు.. ఎలుకల భయం పట్టి పీడిస్తోంది. ఇటీవల వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో రోగిని ఎలుకలు కరిచిన ఘటన గుర్తుండే ఉంటుంది.

ఆ ఘటన మరచిపోక ముందే ఝార్ఖండ్ లోనూ అలాంటి ఘటనే ఒకటి జరిగింది. గిరిధ్ లోని సదర్ ఆసుపత్రిలో మూడు రోజుల పసికందు (అమ్మాయి)ను ఎలుకలు కరిచాయి. ఈ నెల 2న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ చిన్నారి పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి ధన్ బాద్ లోని షాహీద్ నిర్మల్ మహతో మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. చిన్నారి మోకాలుకు తీవ్రగాయమైందని, శస్త్రచికిత్స నిపుణుడితో చికిత్స చేయించామని చెప్పారు.

గిరిధ్ ఆసుపత్రిలోని మోడల్ మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ (ఎంసీహెచ్) విభాగంలో ఉన్న తన బిడ్డ దగ్గరకు వెళ్లానని, అక్కడ తన కూతురుపై ఎలుకలు పాకుతూ మోకాలిని కరిచాయని ఆ పసికందు తల్లి మమతా దేవి చెప్పారు. పాపకు కామెర్లు వచ్చాయంటూ ఆన్ డ్యూటీ నర్సు చెప్పిందని, మంచి ఆసుపత్రికి తీసుకెళ్లాలంటూ ఆ నర్సు సలహా ఇచ్చిందని ఆమె తెలిపారు.

కాగా, ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్టు ఉన్నతాధికారులు తెలిపారు. ఆన్ డ్యూటీ డాక్టర్ పై చర్యలు తీసుకుంటామన్నారు. దీనిపై ఇప్పటికే అదనపు ప్రధాన కార్యదర్శి, ఝార్ఖండ్ ఆరోగ్య శాఖకు లేఖలు పంపించామని గిరిధ్ డిప్యూటీ కమిషనర్ నమన్ ప్రియేశ్ లక్రా చెప్పారు. ఇద్దరు ఔట్ సోర్సింగ్ నర్సింగ్ మిడ్ వైఫరీ స్టాఫ్ ను తొలగించామన్నారు. స్వీపర్ నూ పంపిచేశామని, ఏఎన్ఎంను సస్పెండ్ చేశామని చెప్పారు. ఘటనపై దర్యాప్తునకు కమిటీని నియమించామన్నారు.

Related posts

బస్టేషన్, రైల్వేస్టేషన్లలో ప్రయాణికుల రద్దీ!

Drukpadam

భద్రాచలం సీతారాముల కల్యాణంలో చిన్నజియ్యర్ సోత్కర్ష…!

Drukpadam

లౌకిక ప్రజాస్వామిక వ్యవస్థ పరిరక్షణకు స్వాతంత్ర్య ఉద్యమ సూర్తితో ఉద్యమిద్దాం…సీపీఎం ఖమ్మం జిల్లాకార్యదర్శి నున్నా

Drukpadam

Leave a Comment