Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

మీ ప్రతాపం… దమ్ముంటే నాపై చూపండి: వైసీపీ నేతలపై జనసేనాని ఫైర్

బీజేపీ అభ్యర్థి రత్నప్రభ తరుపున పవన్ కళ్యాణ్ ప్రచారం
  • తిరుపతి లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక
  • బీజేపీ అభ్యర్థిగా రత్నప్రభ
  • ప్రచారంలో పాల్గొన్న పవన్ కల్యాణ్
  • వైసీపీపై తీవ్ర విమర్శలు
  • సై అంటూ సవాల్ విసిరిన జనసేనాని
Pawan Kalyan challenges YCP leaders in Tirupati

తిరుపతి లోక్ సభ స్థానం అభ్యర్థి రత్నప్రభ తరఫున జనసేనాని పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. తిరుపతి శంకరంబాడి కూడలి వద్ద ఏర్పాటు చేసిన సభలో ఆయన వాడీవేడిగా ప్రసంగించారు. యువత తాజా పరిణామాల పట్ల వెనుకంజ వేస్తున్న తీరు తనకు అసంతృప్తి కలిగిస్తోందన్నారు. తాను రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా యువత రోడ్లపైకి పోటెత్తుతుందని, కానీ ఎన్నికల వద్దకు వచ్చేసరికి అదే యువత భయపడుతుంటుందని అన్నారు.

“ఒక ఎమ్మెల్యే బెదిరిస్తే భయపడిపోతారా… ఏం  పౌరుషం లేదా మీలో? ఆత్మగౌరవం లేని బతుకులా మనవి? భయపడితే చచ్చిపోతాం తప్ప ముందుకెళ్లం. శ్రీశ్రీ చెప్పినట్టు పోరాడితే పోయేదేం లేదు బానిస సంకెళ్లు తప్ప” అంటూ ఉద్వేగపూరితంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా తాను సినిమాల్లో నటించడంపై వివరణ ఇచ్చారు. రాజకీయాల కోసం మూడేళ్లు సినిమాలను పక్కనబెట్టానని అన్నారు. అయితే తనపై విమర్శలు చేస్తున్నవారిలా తనకు సిమెంట్ ఫ్యాక్టరీలు, పేకాట క్లబ్బులు లేవని అన్నారు.

“ఈ రాజకీయ నాయకులకు ఎక్కడ్నించి డబ్బులు వస్తున్నాయి? ఎవడబ్బ సొమ్ము అని విచ్చలవిడిగా వెదజల్లుతున్నారు? పిడికెడు రాగిసంకటి తిని బతుకుతానే తప్ప అడ్డదారులు తొక్కను” అని స్పష్టం చేశారు.

ఎంతో ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన రత్నప్రభ గారిని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఏ పార్టీ ఏ అభ్యర్థిని నిలుపుకున్నా తమకు అభ్యంతరం లేదని, కానీ ఇక్కడ ఎవరిని గెలిపిస్తే లాభదాయకంగా ఉంటుందో ఓటర్లు ఆలోచించుకోవాలని స్పష్టం చేశారు. ఒకవేళ వైసీపీ అభ్యర్థిని గెలిపిస్తే ఢిల్లీ వెళ్లి ఏం మాట్లాడగలరని ప్రశ్నించారు. ఇంతమంది ఎంపీల బలగం ఉండి కూడా వైసీపీ వాళ్లు ఏం సాధించలేకపోయారని పవన్ కల్యాణ్ విమర్శించారు. వెనుకటికి ఎవరో  ఆర్నెల్లు కర్రసాము చేసి మూలన ఉన్న ముసలమ్మను కొట్టాడట అంటూ ఛలోక్తి విసిరారు.

“అందుకా వీళ్లకు 151 ఎమ్మెల్యే సీట్లు, 22 ఎంపీ సీట్లు ఇచ్చింది? రోడ్డుమీదకొచ్చే పిల్లల్ని చావగొడతాం, మీపై అట్రాసిటీ కేసులు పెడతాం… ప్రత్యర్థులకు ఓట్లేస్తే పథకాలు తీసేస్తాం అని బెదిరించేందుకా మీకు అధికారం ఇచ్చింది? సామాన్యులపైనా మీ ప్రతాపం…. దమ్ముంటే మీ ప్రతాపం పవన్ కల్యాణ్ పై చూపండి! మీరు ఎలాంటి గొడవ పెట్టుకుంటారో పెట్టుకోండి… ఎదుర్కొనేందుకు నేను సిద్ధంగా ఉన్నా… దేనికైనా సై. వైసీపీ నాయకులకు ఇదే నా సవాల్!”

“నేను అధికారం కోసం రాలేదు. నటుడ్ని అయ్యాను, ప్రజల అభిమానం సంపాదించుకున్నాను. ప్రజల గుండెల్లో ఉన్న స్థానం కంటే నాకు పెద్ద పదవి అక్కర్లేదు. గెలిచినా, ఓడినా తుది శ్వాస వరకు మీకోసమే పనిచేస్తా. నాకు వాణిజ్య ప్రకటనలు అక్కర్లేదు. నేను చేయను కూడా. నేను కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ ను కాను. ప్రజలకే బ్రాండ్ అంబాసిడర్ ను” అంటూ ఉద్ఘాటించారు.

రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణంగా తయారయ్యాయని పవన్ పేర్కొన్నారు. సీఎం సొంత చిన్నాన్న హత్యకు గురైతేనే రాష్ట్రంలో దిక్కులేదని, రెండేళ్ల కిందట హత్య జరిగితే ఇప్పటివరకు ఏమీ తేలలేదని అన్నారు. “రాష్ట్రంలో 100 మంది ఐపీఎస్ లు ఉన్నారు, మీ చేతిలో సీఐడీ, ఇతర అధికారులు ఉన్నారు, ఎందుకు దోషులను పట్టుకోలేకపోతున్నారు. వీళ్లా సామాన్యులకు న్యాయం చేసేది?” అంటూ నిప్పులు చెరిగారు..

Related posts

బీజేపీలో చేరుతున్నట్లు నాపై దుష్ప్రచారం :టీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్…

Drukpadam

ఏపీ సీఎం జ‌గ‌న్‌తో ఎంపీ మార్గాని భ‌ర‌త్ తండ్రి భేటీ!..!

Drukpadam

కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయిన కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి!

Drukpadam

Leave a Comment