బాహుబలి తర్వాత తెలుగు సినిమాల స్థాయి పెరిగింది. బాక్సాఫీస్ స్టామినా పెరిగింది. మన సినిమాలు దేశ వ్యాప్తంగా పలు భాషల్లో విడుదల అవుతున్నాయ. ఆల్ ఇండియా బాక్సాఫీస్‌ను కొల్లగొట్టేస్తున్నాయి. ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలు తెలుగులో రీమేక్ అయ్యేవి.. కానీ ఇప్పుడు మన సినిమాలే అక్కడ రీమేకై.. భారీ వసూళ్లని రాబడుతున్నాయి. మన దర్శకులు పాన్ ఇండియా స్థాయిలో సినిమాలను తెరకెక్కిస్తున్నారు. దీంతో టాలీవుడ్ సినిమాల స్థాయి అమాంతం పెరిగిపోయింది. స్థాయి పెరగడంతో హీరో, దర్శకుల రెమ్యునరేషన్ కూడా భారీగా పెరిగింది. మరీ ముఖ్యంగా టాలీవుడ్ అగ్ర దర్శకులు రాజమౌళి, త్రివిక్రమ్ తదితరులు తమ తాజా సినిమాలకు భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. టాలీవుడ్ టాప్ డైరెక్టర్లు ఒక్కో సినిమాకు ఎన్ని కోట్లు తీసుకుంటున్నాడో చూద్దాం..
సినిమా మాదిరే రెమ్యునరేషన్ కూడా భారీగా తీసుకుంటున్న దర్శకధీరుడు
ఈరోజు ప్రపంచ మొత్తం తెలుగు సినిమా గురించి మాట్లాడుకుంటుంది అంటే అది రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ సినిమా వల్లనే. ఈ సినిమా రికార్డులను చూసి భారతీయ సినిమా ఇండస్ట్రీలన్నీ ఖంగుతిన్నాయి. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా, ఎంత పెద్ద డైరెక్టర్ అయినా.. ప్రస్తుతం వారి లక్ష్యం ‘బాహుబలి’ రికార్డులను అధిగమించడం. అంత పెద్ద ట్రెండ్ సెట్ చేశారు మన జక్కన్న. పాన్ ఇండియా లెవల్లో సినిమాలు తీసే సత్తా ఉన్న ఈ దర్శకధీరుడు.. రెమ్యునరేషన్ కూడా రికార్డు స్థాయిలో తీసుకుంటున్నాడు. ఒక్కో సినిమాకు రూ.30 కోట్లు తీసుకోవడంతో పాటు లాభాల్లో వాటా కూడా తీసుకుంటాడట. సినిమా స్థాయిని బట్టి ఆయన పారితోషికం మారుతుంది.
రేటు పెంచిన సుకుమార్
క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ తీసే సినిమాలు ప్రేక్షకులను కొత్త అనుభూతినిస్తాయి. బాక్సాఫీస్‌ను కొల్లగొడుతాయి. ఇక రంగస్థలం తర్వాత సుకుమార్ రేంజ్ పెరిగిపోయింది. ఒక్కో సినిమాకు ఆయన రూ.20 కోట్లతో పాటు లాభాల్లో వాటా కూడా తీసుకుంటాడు. ప్రస్తుతం ఆయన అల్లు అర్జున్‌తో ‘పుష్ప’ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా కోసం సుకుమార్ దాదాపు రూ.23 కోట్ల వరకు పారితోషకాన్ని తీసుకుంటున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ విషయాలపై అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు.
మాటల మాంత్రికుడు@20 కోట్లు
తెలుగు ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్స్ లో త్రివిక్రమ్ కూడా ఒకడు. ఈయనతో పని చేయడానికి స్టార్ హీరోలు క్యూ కడతారు. మరోవైపు త్రివిక్రమ్ కేవలం సినిమాలు మాత్రమే కాకుండా కమర్షియల్ యాడ్స్ కూడా చేస్తుంటాడు. ఇక ఈయన ఒక్కో సినిమాకు రూ.20 కోట్లు పారితోషికంగా తీసుకోవడంతో పాటు.. లాభాల్లో వాటాను కూడా తీసుకుంటాడు. ఇక అల వైకుంఠపురములో తర్వాత ఈ మాటల మాంత్రికుడి రేంజ్ మరింత పెరిగింది.
రెంజ్ పెరగడంతో రేటు పెంచిన కొరటాల
కొరటాల శివ ఒక్కో సినిమాకు రూ.20 కోట్లకు పైనే తీసుకుంటాడు. ప్రస్తుతం ఆయన మెగాస్టార్ చిరంజీవితో ‘ఆచార్య’ మూవీని తెరకెక్కిస్తున్నాడు. దాదాపు రెండేళ్ల నుంచి ఆయన ఈ ఒక్క సినిమాపైనే ఉన్నాడు. అందుకే ‘ఆచార్య’కు తన తన రెమ్యునరేషన్‌ని మరింత పెంచినట్లు తెలుస్తోంది.
డిజాస్టర్ అయినా వెనక్కి తగ్గని బోయపాటి
బోయపాటి గత చిత్రం వినయ విదేయ రామ భారీ డిజాస్టర్ అయినప్పటికీ ఆయన రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం వెనక్కి తగ్గటం లేదు. ఒక్కో సినిమాకు ఆయన రూ.10 కోట్లకు పైనే తీసుకుంటారట. గతంలో బాలయ్యకు సింహా, లెజెండ్ లాంటి సూపర్ హిట్ అందించిన బోయపాటి.. మరోసారి ఆయనతో మాస్ యాక్షన్ మూవీని తెరకెక్కిస్తున్నాడు.
ఫలితం ఎలా ఉన్నా.. ఒకే రేటు అంటున్న పూరి
డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో ఏ హీరో వర్క్ చేసినా కూడా జనాల్లో ఒక స్పెషల్ క్రేజ్ అందుకుంటారు. సినిమా హిట్టా, ఫ్లాపా అనే సంగతి పక్కన పెడితే వీలైనంత వరకు పూరి హీరోలలో ఉన్న అసలైన ఎనర్జీని బయటకు తెప్పిస్తాడు. ఎన్నో బాక్సాఫీస్ హిట్స్ అందుకున్న పూరి జగన్నాథ్ చిన్నా పెద్దా తేడా లేకుండా దాదాపు అందరి హీరోలతో వర్క్ చేశారు. సినిమాను బట్టి ఆయన రెమ్యునరేషన్‌లో తేడా ఉంటుందట. మొత్తనికి ఆయన ఒక్కో సినిమాకు రూ.7 నుంచి 10 కోట్ల వరకు తీసుకుంటాడట. పూరి ప్రస్తుతం సొంత నిర్మాణ సంస్థలో సినిమాలు చేస్తున్నాడు కాబట్టి ఆయన రెమ్యునరేషన్‌ని అంచనా వేయడం కష్టం.
అనిల్‌కు అన్ని కోట్లు ఇవ్వాల్సిందే
వరుస విజయాలతో దూసుకెళ్తున్న యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. మహేశ్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా హిట్ తర్వాత అనిల్ తన రేటు పెంచాడని టాక్. ఆయన ఒక్కో సినిమాకు రూ. 8 కోట్లకు పైనే తీసుకుంటాడట. వీరితో పాటు శేఖర్ కమ్ముల రూ.5 కోట్లు, నాగ్ అశ్విన్ రూ.8 కోట్లు, పరుశురామ్ రూ.8 కోట్లు, క్రిష్ రూ.4 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాల టాక్.