Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

శివసేనను బీజేపీ అంతం చేయాలనుకుంటోంది… ఉద్ధవ్ థాకరే!

శివసేనను బీజేపీ అంతం చేయాలనుకుంటోంది… ఉద్ధవ్ థాకరే!
-హిందూ ఓటు బ్యాంకును వేరే పార్టీతో పంచుకోవాలని బీజేపీ భావించడం లేదన్న ఉద్ధవ్
-సొంత వ్యక్తుల చేతిలో శివసేన మోసపోయిందని వ్యాఖ్య
-పోయేవాళ్లు వెళ్లిపోండి.. కొత్త శివసేనను తయారు చేస్తానన్న ఉద్ధవ్

శివసేనను అంతం చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే మండిపడ్డారు. తమ పార్టీ కేడర్ ను తీసుకెళ్లేందుకు యత్నిస్తోందని దుయ్యబట్టారు. పార్టీ కార్యకర్తలతో వర్చువల్ గా జరిగిన సమావేశంలో థాకరే మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. క్లిష్ట సమయంలో కూడా అండగా ఉన్న పార్టీ నేతలు, కార్యకర్తలే శివసేన అసలైన ఆస్తి అని చెప్పారు.

సొంత వ్యక్తుల చేతిలోనే శివసేన మోసపోయిందని థాకరే ఆవేదన వ్యక్తం చేశారు. ఏక్ నాథ్ షిండేతో పాటు గువాహటిలో మకాం వేసిన పార్టీ రెబెల్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పార్టీకి ద్రోహం చేసి వెళ్లిపోయిన వీరందరికి మనం ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చామని… మీలో చాలా మంది టికెట్లు ఆశించినప్పటికీ, మీకు కాకుండా వారికి టికెట్లు ఇచ్చామని చెప్పారు. మీ త్యాగాలతో, మీ ఓట్లతో గెలిచిన తర్వాత వీరంతా పార్టీకి వెన్నుపోటు పొడిచి వెళ్లారని మండిపడ్డారు. ఇంత కష్ట కాలంలో కూడా పార్టీ వెన్నంటి ఉన్న మీకు కేవలం ధన్యవాదాలు చెపితే సరిపోదని అన్నారు.

సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్న భాగస్వామ్య పార్టీల నుంచి వస్తున్న ఫిర్యాదులను పరిశీలించాలని షిండేకు తాను చెప్పానని… అయితే, ఆ పని చేయకుండా… బీజేపీతో చేతులు కలపాలని మన ఎమ్మెల్యేల నుంచి ఒత్తిడి వస్తోందని ఆయన తనతో చెప్పారని అన్నారు. బీజేపీతో కలవాలంటున్న ఎమ్మెల్యేలను తన వద్దకు తీసుకురావాలని, వారితో తాను మాట్లాడతానని చెప్పానని తెలిపారు. శివసేనను బీజేపీ చాలా దారుణంగా చూసిందని అన్నారు. శివసేన రెబెల్ ఎమ్మెల్యేలలో చాలా మందిపై కేసులు ఉన్నాయని… బీజేపీతో చేతులు కలిపితే వారికి క్లీన్ చిట్ వస్తుందని… శివసేనలోనే ఉంటే వాళ్లు జైలుకు పోతారని అన్నారు.

శివసేనకు చెందిన వ్యక్తి సీఎం అయ్యే అవకాశం ఉంటే బీజేపీలోకి వెళ్లండని షిండేని ఉద్దేశించి థాకరే చెప్పారు. కానీ బీజేపీతో చేతులు కలిపినంత మాత్రాన మీరు సీఎం కాలేరని, బీజేపీ వ్యక్తే సీఎం అవుతారని, మీకు డిప్యూటీ సీఎం మాత్రమే అయ్యే అవకాశం ఉందని అన్నారు. ఒకవేళ ఉప ముఖ్యమంత్రి కావాలనే కోరిక మీకు ఉన్నట్టయితే, ఆ విషయాన్ని తనతో చెప్పి ఉంటే తానే డిప్యూటీని చేసేవాడినని అన్నారు.

శివసేనను నడిపించే శక్తి తనకు లేదని పార్టీ వర్కర్లు భావిస్తే… అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవడానికి తాను సిద్ధమని థాకరే చెప్పారు. హిందూ ఓటు బ్యాంకును వేరే పార్టీతో పంచుకోవాలని బీజేపీ భావించడం లేదని… అందుకే శివసేనను అంతం చేయాలనుకుంటోందని విమర్శించారు. హిందూ ఓటు బ్యాంకు చీలకూడదనే ఏకైక ఉద్దేశంతోనే బాల్ థాకరే బీజేపీతో చేతులు కలిపారని గుర్తు చేశారు.

శివసేన రెబెల్ ఎమ్మెల్యేలతో కలిపి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా అది ఎక్కువ కాలం ఉండదని థాకరే చెప్పారు. ఎందుకంటే రెబెల్ ఎమ్మెల్యేలలో ఎక్కువ మంది సంతోషంగా లేరని అన్నారు. శివసేన రెబెల్స్ ఎవరూ కూడా వచ్చే ఎన్నికల్లో గెలవరని జోస్యం చెప్పారు. శివసేన ఓటర్ల వల్ల గెలిచిన ఎమ్మెల్యేలను మీరు తీసుకెళ్లి ఉండొచ్చని… కానీ శివసేన ఓటర్లను మాత్రం తీసుకెళ్లలేరని అన్నారు. పార్టీ నుంచి వెళ్లిపోవాలనుకున్న వారు వెళ్లిపోవచ్చని… తాను కొత్త శివసేనను తయారు చేస్తానని చెప్పారు.

శివ సైనికుల సహనం నశిస్తోంది.. సంజయ్​ రౌత్​ హెచ్చరిక

శివసేన చాలా పెద్దదని, దానిని ఎవరూ హస్తగతం చేసుకోలేరని ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. ఎన్నో త్యాగాలతో పార్టీ నిర్మాణం జరిగిందని.. దానిని ఎవరూ ధన బలంతో ధ్వంసం చేయలేరని పేర్కొన్నారు. శనివారం పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి వెళ్లే ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు శివ సైనికులు ఓర్పుగా ఉన్నారని.. అయితే వారిలో సహనం నశిస్తోందని ప్రకటించారు. ఒకవేళ శివ సైనికులు గనుక బయటికి వస్తే వీధుల్లో అగ్గి రాజుకుంటుందని తిరుగుబాటు ఎమ్మెల్యేలను హెచ్చరించారు.

సభకు రండి.. ఎవరి బలమెంతో తేలుతుంది
శుక్రవారం రాత్రి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో భేటీ అయ్యానని.. ఆ సమయంలో పది మంది తిరుగుబాటు ఎమ్మెల్యేల నుంచి తమకు ఫోన్ వచ్చిందని సంజయ్ రౌత్ వెల్లడించారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలు సభలో విశ్వాస పరీక్షకు రావాలని.. అప్పుడు ఎవరు బలవంతులో తేలుతుందని సవాల్ చేశారు. కాగా.. ఏక్ నాథ్ షిండేతో కలిసి అసోంలోని గువాహటి క్యాంపులో ఉన్న తిరుగుబాటు ఎమ్మెల్యే తానాజీ సావంత్ కార్యాలయంపై శివసేన కార్యకర్తలు శనివారం దాడి చేశారు.

దేవేంద్ర ఫడ్నవిస్ కు నేనిచ్చే సలహా ఇదే: సంజయ్ రౌత్

శివసేనలో ముసలం పుట్టిన సంగతి తెలిసిందే. ఏక్ నాథ్ షిండే నాయకత్వంలో ఆ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. ఈ మొత్తం వ్యవహారాన్ని బీజేపీ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవిస్ వెనకుండి నడపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో శివసేన కీలక నేత సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడుతూ ఫడ్నవిస్ కు ఒక సలహా ఇచ్చారు.

తమ పార్టీలో తలెత్తిన సంక్షోభంలో తల దూర్చవద్దని ఫడ్నవిస్ కు తాను సూచిస్తున్నానని చెప్పారు. గతంలో ఏం జరిగిందో ఫడ్నవిస్ గుర్తుకు తెచ్చుకోవాలని… ఉదయం ఏం జరిగిందో సాయంత్రానికల్లా అది లేకుండా పోయిందని చెప్పారు.

గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎన్సీపీకి చెందిన అజిత్ పవార్ మద్దతుతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే కేవలం 80 గంటల సేపు మాత్రమే ఫడ్నవిస్ సీఎం కుర్చీలో ఉన్నారు. ఆ తర్వాత అజిత్ పవార్ బీజేపీకి మద్దతు ఉపసంహరించుకోవడంతో బీజేపీ ప్రభుత్వం పడిపోయింది. దీన్ని ఉద్దేశించే సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు.

Related posts

తెలంగాణ‌లో సీఎం కేసీఆర్ విధానాల కార‌ణంగా 24 గంట‌లు విద్యుత్‌:ఎంపీ నామ

Drukpadam

కాంగ్రెస్ లో కపిల్ సిబాల్, గులాం నబి ఆజాద్ కుంపటి …వారిపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్న నేతలు!

Drukpadam

ఈనెల 24 న కాంగ్రెస్ గూటికి డి.శ్రీనివాస్ …

Drukpadam

Leave a Comment