కేంద్రంపై యుద్ధమే …కార్యాచరణపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేసీఆర్ మంతనాలు!
-పార్లమెంట్ లోపల బయట దూకుడుగా పోరాటం..
-కేంద్రం వైఖరిపై కేసీఆర్ సమరశంఖం అంటూ టీఆర్ఎస్ ప్రకటన
-పలు విపక్ష పార్టీల నేతలు, జాతీయ నాయకులతోనూ మాట్లాడుతున్నట్టు వెల్లడి
-దేశవ్యాప్తంగా నిరసనలతో కేంద్రం తీరును ఎండగట్టాలని నిర్ణయించినట్టు ప్రకటన
-ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాలు
-ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ సమావేశం
-తెలంగాణ పట్ల అనుసరిస్తున్న తీరుపై నిలదీయాలని సూచించనున్న సీఎం
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అసంబద్ధ వైఖరిపై పోరాటం కోసం దేశవ్యాప్తంగా వివిధ విపక్ష పార్టీలతో సీఎం కేసీఆర్ మంతనాలు సాగిస్తున్నారని టీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. కేంద్రం మెడలు వంచి దేశంలో ప్రజాస్వామిక విలువలను కాపాడే దిశగా మరింత దూకుడుగా ముందుకు సాగుతున్నారని పేర్కొంది.
‘‘కలిసివచ్చే అన్నిరాష్ట్రాల విపక్ష పార్టీలను సమన్వయం చేసుకుంటూ, ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బీజేపీ కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ పూరించనున్న ప్రజాస్వామిక సమర శంఖం ఇది. దేశంలో ప్రమాదంలో పడుతున్న ఫెడరల్, సెక్యులర్ ప్రజాస్వామిక విలువలను కాపాడాలనే తన ప్రయత్నాలకు కేసీఆర్ మరింత పదును పెట్టనున్నారు..” అని టీఆర్ఎస్ వెల్లడించింది. ఆర్థిక సంక్షోభంలోకి దేశాన్ని నెట్టివేస్తున్న కేంద్ర వైఖరిని తేటతెల్లం చేసేందుకు కూడా కేసీఆర్ కసరత్తు చేస్తున్నట్టు తెలిపింది.
ముఖ్యమంత్రులతో కేసీఆర్ మంతనాలు
కేంద్రంపై నిరసనలకు మద్దతు కూడగట్టేందుకు దేశంలోని పలు రాష్ట్రాల విపక్ష నేతలతో సీఎం కేసీఆర్ ఫోన్ లో మంతనాలు సాగిస్తున్నట్టు టీఆర్ ఎస్ వెల్లడించింది. శుక్రవారం పలువురు ముఖ్యమంత్రులతో కేసీఆర్ మాట్లాడారని.. జాతీయ నేతలతో చర్చలు కొనసాగుతున్నాయని తెలిపింది.
‘‘నేటి ఉదయం నుంచి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సన్నిహితులతో, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, యూపీ ప్రతిపక్ష నేత అఖిలేశ్ యాదవ్, శరద్ పవార్ సహా ఇతర జాతీయ విపక్ష నేతలతో సీఎం కేసీఆర్ స్వయంగా ఫోన్ లో మాట్లాడుతున్నారు. కేంద్రంపై ప్రజాస్వామిక పోరాటంలో భాగంగా కేసీఆర్ ప్రతిపాదనలకు పలు రాష్ట్రాల విపక్ష పార్టీల ముఖ్యమంత్రులు, ప్రధాన ప్రతిపక్ష నేతలు సానుకూలంగా స్పందిస్తున్నారు..” అని టీఆర్ ఎస్ ప్రకటించింది.
దేశవ్యాప్త నిరసనలకు ప్రణాళిక
పార్లమెంటు సమావేశాలను వేదికగా చేసుకుని బీజేపీ, కేంద్ర ప్రభుత్వ దమననీతిపై పోరాటం చేయనున్నట్టు టీఆర్ఎస్ ప్రకటించింది. బీజేపీ ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలను తీవ్రంగా ఖండిస్తూ.. దేశవ్యాప్త నిరసనలతో కేంద్రం అసలు స్వరూపాన్ని ఎండగట్టేందుకు సీఎం కేసీఆర్ సన్నద్ధమవుతున్నట్టు తెలిపింది. అటు వరదల నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు మంత్రులు, అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇస్తూనే.. ఇటు బీజేపీ అప్రజాస్వామిక విధానాల విపత్తు నుంచి దేశాన్ని కాపాడే పోరాటానికి కేసీఆర్ సమాయత్తం అయ్యారని పేర్కొంది.
పార్లమెంట్ లో దూకుడుగా వ్యవహరించాలని కేసీఆర్ నిర్ణయం ….
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల పై పోరాడాలని, ఇందుకోసం పార్లమెంటు సమావేశాలను వేదికగా చేసుకోవాలని టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు టీఆర్ఎస్ ఎంపీలకు సూచనలు చేయనున్నారు. ఈ నెల 18 నుంచి పార్లమెంటు సమావేశాలు మొదలవుతున్నాయి. దీంతో ఉభయ సభల్లో టీఆర్ఎస్ పార్టీ అనుసరించాల్సిన విధి విధానాలపై దిశానిర్దేశం చేసేందుకు శనివారం మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రగతిభవన్ లో పార్టీ ఎంపీలతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు ట్విట్టర్, ఫేస్ బుక్ లలో టీఆర్ ఎస్ పార్టీ వివరాలను వెల్లడించింది.
ప్రోత్సహించాల్సింది పోయి ఇబ్బంది పెడుతున్నారంటూ..
‘‘తెలంగాణకు అన్ని రంగాల్లో నష్టం చేసే విధంగా బీజేపీ సర్కారు తీరు ఉందని, దీనిపై పార్లమెంటు ఉభయ సభల్లో తీవ్ర నిరసన ప్రకటించాలని, పోరాటానికి పూనుకోవాలని ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఆర్ధిక క్రమశిక్షణను పాటిస్తూ అనతి కాలంలో అభివృద్ధి పథంలో పయనిస్తున్న తెలంగాణ రాష్ట్రాన్ని ప్రోత్సహించాల్సింది పోయి ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేయాలని కేంద్రం కుటిల ప్రయత్నాలు చేస్తుండటాన్ని నిలదీయాలని.. బీజేపీ ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టాలని ఎంపీలకు సీఎం కేసీఆర్ సూచించనున్నారు. తెలంగాణ రైతుల ధాన్యాన్ని కొనకుండా రైతులు, మిల్లర్లు, ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై పోరాడాలని ఎంపీలకు పిలుపునివ్వనున్నారు..” అని టీఆర్ఎస్ పార్టీ పేర్కొంది.
ద్వంద్వ వైఖరిని నిలదీయాలంటూ..
‘‘ఉపాధి హామీ పథకాన్ని పటిష్ఠంగా అమలు చేస్తున్న తెలంగాణ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న పొంతనలేని ద్వంద్వ వైఖరిని, దుర్మార్గ విధానాన్ని నిలదీయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. తెలంగాణలో ఉపాధి హామీ పథకం గొప్పగా అమలవుతున్న తీరు, సోషల్ ఆడిట్ లను కేంద్ర ప్రభుత్వం పలుమార్లు ప్రశంసించింది, అవార్డులు ఇచ్చింది. కానీ ఇప్పుడు అందుకు విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వాన్ని ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెడుతున్న తీరును నిలదీయాలని ఎంపీలకు సీఎం సూచించనున్నారు” అని టీఆర్ఎస్ తెలిపింది.
రూపాయి పతనంపై కేంద్రాన్ని నిలదీయాలి..
‘‘ఆర్థిక రంగంలో కేంద్రం అనుసరిస్తున్న అసంబద్ధ విధానాలతో రోజురోజుకూ దేశ ఆర్థిక వ్యవస్థ పతనమౌతున్నదని ఆర్థిక వేత్తలు ఆందోళన చెందుతున్నారు. క్షీణిస్తున్న రూపాయి విలువే అందుకు నిదర్శనంగా దేశ ప్రజలు భావిస్తున్నారు. దేశ అభివృద్ధి సూచి రోజురోజుకూ పాతాళానికి చేరుకుంటున్న పరిస్థితుల్లో దేశాన్ని ఆర్థిక సంక్షోభం బారిన పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత దేశ పౌరులుగా తెలంగాణ ప్రజలకు ఉందని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. దీనిని ప్రతిబింబించేలా రూపాయి పతనంపై కేంద్రాన్ని ఉభయ సభల సాక్షిగా నిలదీయాలని ఎంపీలకు సూచించనున్నారు. ఇదే సమయంలో కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై టీఆర్ఎస్ చేస్తున్న పోరాటంలో కలిసివచ్చే ఇతర రాష్ట్రాల ఎంపీలను కూడా కలుపుకుపోవాలని వివరించనున్నారు” అని టీఆర్ఎస్ పార్టీ పేర్కొంది.