సిపిఐ ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ ముట్టడి వాయిదానా ? ..?రద్దా…??
–రూరల్ సి ఐ ని బదిలీ చేయాలనీ కోరుతూ సిపిఐ స్టేషన్ ముట్టడికి పిలుపు
–మునుగోడు ఎన్నిక నేపథ్యంలో సిపిఐ తో సఖ్యతతో వెళ్లాలని కేసీఆర్ నిర్ణయం
–గత నెలరోజులుగా సి ఐ పై కారాలు మిరియాలు నూరిన సిపిఐ
–అధికార పార్టీ నేతలు ,పోలీస్ అధికారుల జోక్యంతో ఆందోళన వాయిదా
–జిల్లా మంత్రి , ఎంపీలు నామ,వద్దిరాజు ,ఎమ్మెల్యే కందాల రాయబారం
–సి ఐ పై చర్యలకు అంగీకారం …మాకు కావాల్సింది అదే అంటున్న సిపిఐ
ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ సి ఐ శ్రీనివాస్ రావు సిపిఐ నాయకుల పట్ల ప్రధానంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేష్ ను టార్గెట్ చేసి అనుచితంగా ప్రవర్తించడం , మీరు పిటిషన్ లు తీసుకోని మాటిమాటికి వస్తే మీకు కూడా తెల్దారుపల్లి కృష్ణయ్య కు పట్టిన గతే పడుతుందని బెదిరింపులకు పాల్పడటం , మిమ్ములను చంపుతారని చెప్పడంపై సిపిఐ జిల్లా, రాష్ట్రస్థాయి నాయకులూ భగ్గుమన్నారు . సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన అనంతరం మొదటిసారిగా ఖమ్మం వచ్చిన కూనంనేని సాంబశివరావు కు వరంగల్ క్రాస్ రోడ్ లో సిపిఐ నాయకులూ పెద్ద ఎత్తున స్వాగతం పలికి పోలీస్ స్టేషన్ పక్కనే సభ ఏర్పాటు చేయడం అక్కడ సి ఐ ని ఉద్దేశించి సాంబశివరావు , హేమంతరావు లు ఘాటు హెచ్చరికలు జారీ చేయడంపై పోలీసులకు సిపిఐకి మధ్య పెద్ద ఎత్తున వార్ నడుస్తుంది. పైగా మునుగోడు ఉపఎన్నికల నేపథ్యంలో సిపిఐ , గులాబీ పార్టీకి మద్దతు ఇస్తుండగా ,సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు ,రాష్ట్ర నాయకులూ భాగం హేమంతరావు ల పై పోలీసులు కేసు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది.పార్టీ కార్యకర్తల్లో ఒకరకమైన అలజడికి దారితీసింది.
రూరల్ సి ఐ శ్రీనివాస్ రావు ఆయన భార్య లు ఒకే మండలంలో పనిచేయడం పై కూడా సిపిఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. అధికార పార్టీకి కొమ్ముకాస్తూ , ప్రతిపక్ష పార్టీలను అధికార పార్టీలోని వైరి పక్షాన్ని సి ఐ పట్టించుకోవడంలేదని వారు తీసుకుపోయిన రిప్రజెంటేషన్ లు బుట్టదాఖలు చేస్తూ , అధికారపార్టీ కి చెందిన ఒక వ్యక్తితో అతిదగ్గరగా ఉంటూ ఆయన ఎవరిపై కేసు పెట్టమంటే వాళ్లపై కేసులు నమోదు చేస్తూ సిపిఐ ని దెబ్బతీయాలని చూస్తున్నారని సిపిఐ ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో సి ఐ పై చర్యలతోపాటు , ఆయన్ను బదిలీ చేయాలనీ డిమాండ్ చేస్తూ అక్టోబర్ 10 న పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు 15 రోజుల క్రితం పిలుపు నిచ్చింది.
జిల్లా అంతటా పోలీస్ స్టేషన్ ముట్టడిలో పాల్గొనేలా పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్న తరుణంలో అధికారపార్టీ నేతలు ప్రధానంగా జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ , ఎంపీలు నామ నాగేశ్వరరావు , వద్దిరాజు రవిచంద్ర, పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి లు జోక్యం చేసుకొని సిపిఐ డిమాండ్స్ పరిష్కరిస్తామని తమకు కొద్దీ టైం ఇచ్చి 10 వ తేదీన పోలీస్ స్టేషన్ ముందు జరుపతలపెట్టిన కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని కోరారు . ఈ మేరకు పాలేరు ఎమ్మెల్యే ఒక ప్రకటన కూడా విడుదల చేశారు.ఖమ్మం సి పి విష్ణు ఎస్ వారియర్ కూడా సిపిఐ నేతలకు ఆందోళన వాయిదా వేసుకోవాలని కోరారు .దీంతో పునరాలోచనలోపడిన సిపిఐ తమ డిమాండ్స్ పై గట్టి హామీ పొందిన తర్వార ఆందోళన వాయిదాకు నిర్ణయం తీసుకున్నది .
కేసీఆర్ సూచనలమేరకే గులాబీ నేతలు సిపిఐ నేతలతో సంప్రదింపులు జరిపి వారిని శాంతింప జేశారని తెలుస్తుంది.అందువల్ల రేపటి కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంటున్నట్లు సిపిఐ జిల్లా కమిటీ ప్రకటించింది. ఇది వాయిదానా..?రద్దా…? అనేదానిపై స్పష్టత లేదు. అయితే సి ఐ ట్రాన్స్ఫర్ తోపాటు సిపిఐ నాయకులపై పెట్టిన కేసులు ఎత్తివేసేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు సమాచారం …దానితో సిపిఐ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించినా, అసలు కార్యక్రమమే రద్దు అయినట్లు చెప్పుకుంటున్నారు . తమకు కావాల్సింది జరిగితే ఆందోళన అవసరం లేదని సిపిఐ నేతలు కూడా అంటున్నారు . చూద్దాం ముందు ముందు ఏమి జరుగుతుందో …