ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల సంఘం..!!
కేంద్ర ఎన్నికల సంఘం దేశ వ్యాప్తంగా ఉప ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసింది. ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్ – గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావటంతో ఆ రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణ పైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదే సమయంలో తాజాగా ప్రకటించిన షెడ్యూల్ మేరకు ఉన్న5 అసెంబ్లీ స్థానాలు, ఒక పార్లమెంట్ స్థానానికి షెడ్యూల్‌ను విడుదల చేసింది. యూపీ మాజీ సీఎం.. సమాజ్ వాదీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ మరణంతో ఖాళీ అయిన ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి పార్లమెంట్ స్థానానికి షెడ్యూల్ ప్రకటించారు.
దీంతో పాటుగా ఒడిశాలోని పదంపూర్, రాజస్థాన్‌లోని సర్దార్‌షహర్, బీహార్‌లోని కుర్హానీ, ఛత్తీస్‌గఢ్‌లోని భానుప్రతాపూర్, ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ నియోజకవర్గాల్లో డిసెంబర్ 5వ తేదీన పోలింగ్, 8వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. ఈసీ నోటిఫికేషన్ ప్రకారం డిసెంబర్ 8వ తేదీన గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుంది.
నవంబర్ 10 నుండి 17వ తేదీ వరకు అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేయవచ్చు. నవంబర్ 18న నామినేషన్ల పరిశీలన, నవంబర్ 21న అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అని ఈసీ వెల్లడించింది. గుజరాత్- హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలతో పాటుగా ఈ ఉప ఎన్నికల రిజల్స్ ప్రకటించనున్నారు.
గుజరాత్ లో రెండు విడతల పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 1న తొలి విడత, 5న రెండో విడత పోలింగ్ నిర్వహించనున్నారు. 8న ఫలితాలను ప్రకటించనున్నారు. హిమాచల్ ప్రదేశ్ కు సంబంధించి మొత్తం 68 స్థానాలకు ఒకే విడతతో నవంబర్ 12న పోలింగ్ జరగనుంది. గుజరాత్ ఫలితాలతో కలిపి హిమాచల్ ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇక, ఈ నెల 3వ తేదీన దేశ వ్యాప్తంగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. వీటికి సంబంధించి రేపు (ఆదివారం) కౌంటింగ్ జరగనుంది. ఇందులో తెలంగాణలోని మునుగోడు నియోజకవర్గం కూడా ఉంది. రేపు ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. మధ్నాహ్నానికి తుది ఫలితం వెల్లడి కానుంది.