మేయర్ ఎంపికలో ముఖ్యమంత్రి మాటే శిరోధార్యం…
-సీఎం టిక్ పెట్టిన పేరే ఫైనల్ … ఇందులో రెండవ మాటకు తావులేదు
-ఖమ్మం , వరంగల్ కార్పొరేషన్ల మేయర్ల ఎంపికపై టీఆర్ యస్ వర్గాలు
-ఖమ్మం కు ప్రశాంతారెడ్డి ,నరేష్ రెడ్డి ,
-వరంగల్ కు మంత్రులు ఇంద్రకరణ రెడ్డి , గంగుల కమలాకర్ పరిశీలకులు
రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఐదు మున్సిపాల్టీలు , ఖమ్మం , వరంగల్ కార్పొరేషన్ల ఎన్నికల్లో ఘన విజయాలు సొంతం చేసుకున్న టీఆర్ యస్ రేపు జరగనున్న మేయర్లు, డిప్యూటీ మేయర్లు , చైర్మన్లు ,వైస్ చైర్మన్లు ఎంపిక కోసం పరిశీలకులను ఎంపిక చేసింది. ఇప్పటికే ఆయా మున్సిపాల్టీలలో మేయర్లు , డిప్యూటీ మేయర్లు , చైర్మన్లు,వైస్ చైర్మన్లు ఎంపిక కోసం వారు జిల్లాలకు చేరుకున్నారు. పదవులు ఆశించేవారు సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఎంపిక కొంత ఆశక్తిగా మారింది. ఎవరికీ వారు తమకు ఇవ్వాలని కోరుతున్న కేసీఆర్ ,కేటీఆర్ కలిసి ఫైనల్ చేసి సీల్డ్ కవర్ పంపుతారని వార్తల నేపథ్యంలో ఆయా జిల్లాలలోని మంత్రుల పై వత్తిడి పెరిగింది. మంత్రులు కూడా అంతా ముఖ్యమంత్రి చూస్తున్నారని తమ చేతుల్లో ఏమి లేదని ఆయన నిర్ణయం మేరకే అంత జరుగుతుందని చెపుతున్నారు . మంత్రుల మాటకు ప్రయారిటీ ఉండేది నిజమే అయినా చివరకు ముఖ్యమంత్రి కేసీఆర్ మాటే శిరోధార్యం … ఆయన తనదగ్గరకు వచ్చిన పేర్లను పరిశీలించి ఒక పేరుకు టిక్ పెడతారు . ఇందులో రెండవ మాటకు తావులేదు. ప్రతి నియోజవర్గం గురించి ఇంటలిజెన్స్ ద్వారా ముఖ్యమంత్రికి సాధారణంగా నివేదికలు రెగ్యులర్ గానే అందుతాయి . అందులో ఎన్నికల వేళ మరింత అప్రమత్తంగా ఉంటారు. ఇప్పటికే ఆయా మున్సిపాలిటీలు , కార్పొరేషన్ లకు సంబందించిన కార్పొరేటర్ల జాతకాలు ముఖ్యమంత్రి దగ్గర ఉన్నాయి. అందువల్ల ,జిల్లా మంత్రుల అభిప్రాయాలు తీసుకున్నప్పటికీ ,తనదగ్గర ఉన్న సమాచారంతో సరిచూసుకొని కేసీఆర్ తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది . పదవులు ఆశించే వారిగురించి సీఎం దగ్గర సమగ్ర సమాచారం ఉంటుంది . అందువల్ల సీల్డ్ కవర్ లో పేరు పంపిస్తారా ? లేక ఓరల్ గా చెబుతారా ? అనేది అక్కడ ఉండే పరిస్థితులను బట్టి ఉంటుంది. సీల్డ్ కవర్ లేదా ఓరల్ గా సీఎం దగ్గర నుంచి వచ్చిన దూతలద్వారా పేరు ? అనేది వారు వచ్చి ఇక్కడ నాయకులతో సంప్రదించిన తరువాత నిర్ణయిస్తారు . ఏదైనా సీఎం దగ్గర ఆమోదం పొందిన పేరునే పార్టీ అధికారికంగా వెల్లడిస్తుంది. ఒక వేళ ఏమైనా తేడాలు ఉంటె సీఎం ను పరిశీలకు సంప్రదిస్తారు . అనేక మంది పదవులు ఆశిస్తున్నా వారికీ ముందు ముందు మంచి భవిషత్ ఉంటుందని నచ్చచెప్పి అవకాశాలు ఉన్నాయి. ముందుగానే ఎవరు ప్రపోజ్ చేయాలి ఎవరు బలపరచాలని నిర్ణయించిన తరువాత వారిని కాన్సిల్ సమావేశాలకు తరలిస్తారు. అక్కడ చేతులెత్తే పద్దతి ద్వారా ఎన్నిక జరుగుతుంది. అప్పుడు ప్రచారంలో ఉన్న పేర్లు వస్తాయా ? లేక కొత్త పేర్లు ఉంటాయా ?అనేది సహజంగానే ఉత్కంఠంగా ఉంది.డిప్యూటీ మేయర్ పదవి ఆశించి వారి సంఖ్య కూడా అధికంగానే ఉంది. ఖమ్మం మేయర్ ఎవరు అనేది పరిశీలకులు వచ్చి వెల్లడించే వరకు రహస్యంగానే ఉంటుంది. ఇప్పుడు ఖమ్మంలో కొన్ని పేర్లు షికార్లు చేస్తున్నాయి. ఇందులో పూనుకొల్లు నీరజ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది.ఇక పైడిపల్లి రోహిణి , బిక్కసాని ప్రశాంత లక్ష్మి ,పేర్లతో పాటు మరో రెండు పేర్లు చేర్చించుకుంటున్నారు. డిప్యూటీ మేయర్ గా మహిళలకే ఇస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలు కూడా చేసినట్లు సమాచారం . అయితే మేయర్ మహిళ అయినప్పుడు డిప్యూటీ అయినా పురుషుల నుంచి ఉండాలనే ఆలోచన ఉంది. అందువల్ల పార్టీ నగర అధ్యక్షుడుగా ఉన్న కామార్తపు మురళి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. అందరిలో సీనియర్ గా ఉన్న కర్నాటి కృష్ణ ఉన్నప్పటికీ కమ్మ సామాజిక వర్గానికి మేయర్ ఇస్తే అదే సామాజిక వర్గానికి చెందిన కృష్ణకు డిప్యూటీ ఇవ్వడం కుదరదు . రేపే ఎన్నిక కావడంతో అందరిలోనూ ఆశక్తి నెలకొన్నది . మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ఎన్నిక కోసం రాష్ట్ర ఎన్నకల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది.ఎన్నికైన కార్పొరేటర్లతో పాటు స్థానిక ఎమ్మెల్యే ,ఆపరిధిలో నమోదైన ఎమ్మెల్సీలు , ఎంపీ లు సమావేశానికి అర్హులు . కోవిద్ నిబంధనలు అనుసరించి మాస్క్ లు ధరించి సభ్యులు హాజరు కావాల్సి ఉంటుంది.