కరోనా రోగుల విధానంలో మార్పులు చేసిన కేంద్ర ప్రభుత్వం!
- కరోనా బాధితులందరినీ ఆసుపత్రుల్లో చేర్చుకోవాల్సిందే
- పాజిటివ్ రిపోర్టు లేకపోయినా ట్రీట్మెంట్ ఇవ్వాలి
- డిశ్చార్జ్ పాలసీని కచ్చితంగా అమలు చేయాలి
కరోనా బారిన పడిన పేషెంట్లు ఆసుపత్రుల్లో చేరేందుకు ఎన్నో ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాధితులకు ఉపశమనం కలిగేలా కరోనా పేషెంట్స్ విధానంలో కేంద్ర ప్రభుత్వం మార్పులు తీసుకొచ్చింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు తమ నిబంధనలను పాటించాలని ఆదేశాలు జారీ చేసింది.
కేంద్రం జారీ చేసిన నూతన మార్గదర్శకాలు ఇవే:
- కోవిడ్ లక్షణాలు ఉన్నవారిని ఆసుపత్రుల్లో చేర్చుకునేందుకు కరోనా పాజిటివ్ రిపోర్ట్ తప్పనిసరి కాదు. అనుమానం ఉన్న బాధితులందరినీ చేర్చుకుని, చికిత్స అందించాల్సిందే.
- ఏ కారణం వల్లా బాధితుడికి వైద్యం నిరాకరించరాదు. ఇతర ప్రాంతాలకు చెందిన రోగులకు కూడా అత్యవసర ఔషధాలు, ఆక్సిజన్ అందించాలి.
- గుర్తింపు కార్డులు లేకున్నా ఆసుపత్రుల్లో చేర్చుకోవాలి. సరైన ధ్రువీకరణ పత్రాలు లేవనే కారణంతో బాధితులను చేర్చుకోకుండా ఉండకూడదు.
- డిశ్చార్జ్ పాలసీని ఆసుపత్రులు కచ్చితంగా పాటించాలి. హాస్పిటల్ సేవలు అవసరం లేని వారిని డిశ్చార్జ్ చేయాలి.
- అన్ని రాష్ట్రాల సీఎస్ లు మూడు రోజుల్లోగా ఈ నిబంధనలను అనుసరిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలి.