టూత్ బ్రష్‌లు ఒకే దగ్గర పెట్టొద్దు.. అవి కూడా కొవిడ్ కారకాలేనట!
- కుటుంబ సభ్యులు అందరి బ్రష్‌లు ఒకే దగ్గర ఉంచొద్దు
- పేస్టులు కూడా వేర్వేరుగా వాడడం మంచిది
- 0.2 క్లోర్‌హెక్సిడైన్ ఉన్న మౌత్‌వాష్ పుక్కిలించడం మేలు
కరోనా వైరస్ పంజా విసురుతున్న నేపథ్యంలో పళ్లు తోముకునే టూత్ బ్రష్‌లతోనూ ముప్పు పొంచి ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. లక్షణాలు లేకుండానే కొందరు కరోనా బారినపడుతున్నారని, ఆ విషయం తెలియని వారు అందరి బ్రష్‌లతో కలిపే వాటిని కూాడా పెట్టడం వల్ల కరోనా కారకాలుగా మారే అవకాశం ఉందని యూకే నుంచి వెలువడిన బీఎంసీ మెడికల్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం పేర్కొంది. కాబట్టి ఇంట్లోని అందరూ తమ బ్రష్‌లను ఒకే చోట పెట్టడం మానాలని దంత వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే, పేస్టు కూడా విడివిడిగా వాడడమే మంచిందంటున్నారు.
కరోనా సోకినవారు వాడే టూత్‌పేస్టును మిగతా కుటుంబ సభ్యులు వాడడం వల్ల వారికి వైరస్ సోకే ముప్పు 33 శాతం అధికమని అధ్యయనం పేర్కొంది. కాబట్టి ఎవరి బ్రష్‌లు, పేస్టులను వారే వాడాలని సూచించింది. మరోవైపు, కరోనా బారినపడిన వారు ఐసోలేషన్ పూర్తయ్యాక అవే బ్రష్‌లు వాడడం సరికాదని నిపుణులు చెబుతున్నారు. వాటి ఉపరితలంపై 72 గంటలపాటు వైరస్ ఉంటుందని, కాబట్టి ఐసోలేషన్ పూర్తయిన తర్వాత వాటిని వాడకపోవడమే మంచిదని పేర్కొన్నారు.
మౌత్ వాష్‌లతో బ్రష్‌లను శుభ్రం చేయడం ద్వారా 39 శాతం ముప్పు తగ్గుతుందంటున్నారు. వైరస్ సోకిన వ్యక్తులు రోజుకు మూడుసార్లు 0.2 క్లోర్‌హెక్సిడైన్ ఉన్న ఏదైనా మౌత్‌వాష్‌ను పుక్కిలించడం ద్వారా వైరస్ ప్రభావం నుంచి కొంతవరకు బయటపడవచ్చని చెబుతున్నారు. అలాగే ఈ ద్రావణంలో 30 సెకన్లపాటు బ్రష్‌ను ముంచినా 99 శాతం వైరస్ నాశనం అవుతుందని అధ్యయనంలో తేలింది.