ఏపీ మంత్రి అప్పలరాజుపై కర్నూలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
- ఏపీ రాజకీయాలకు కేంద్రబిందువుగా ఎన్440కే వేరియంట్
- ఇప్పటికే చంద్రబాబుపై కేసు నమోదు
- మంత్రి అప్పలరాజుపై టీడీపీ నేతల ఆరోపణలు
- ఎన్440కే కర్నూలులో నిర్ధారణ అయిందన్నాడని వెల్లడి
- మంత్రిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
ఏపీ రాజకీయాలు ప్రస్తుతం ఎన్440కే కరోనా వేరియంట్ చుట్టూ నడుస్తున్నాయి. రాష్ట్రంలో ఈ కొత్త వేరియంట్ వ్యాపిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయనపై ఇప్పటికే కర్నూలులో కేసు నమోదైంది. పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో, టీడీపీ నేతలు ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజుపై కర్నూలు వన్ టౌన్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు.
కర్నూలులో ఎన్440కే వైరస్ ఉన్నట్టు నిర్ధారణ అయిందని అప్పలరాజు చెప్పారని, అది చాలా ప్రమాదకరమైనదని కూడా ఓ చర్చా కార్యక్రమంలో అన్నారని నేతలు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలో మంత్రి అప్పలరాజుపైనా కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
కాగా, మంత్రి అప్పలరాజుపై కర్నూలు వన్ టౌన్ లోనే కాకుండా, పట్టణంలోని ఇతర పోలీస్ స్టేషన్లలోనూ, జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలోనూ ఫిర్యాదులు చేయాలని టీడీపీ శ్రేణులు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.