ఇదెక్కడి న్యాయం జగనన్నా.. సింహాచలం దేవస్థానం మాజీ సభ్యురాలు దేవి ఆవేదన
- దేవిని తొలగించి ఆమె స్థానంలో భాగ్యలక్ష్మికి అవకాశం
- తనను ఎందుకు తొలగించారో చెప్పాలని దేవి డిమాండ్
- సమాచారం ఇవ్వకుండా ఎలా తొలగిస్తారని ప్రశ్న
సింహాచలం దేవస్థానం ట్రస్టు బోర్డు నుంచి తనను తొలగించడంపై దాడి దేవి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడకు చెందిన దేవి దేవస్థానం ట్రస్టు బోర్డు సభ్యురాలిగా కొనసాగుతుండగా ఆమెను అకస్మాత్తుగా తొలగించిన ప్రభుత్వం విశాఖకు చెందిన భాగ్యలక్ష్మిని నియమించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో దేవి తీవ్ర ఆవేదనకు గురయ్యారు.
వైసీపీని ఏర్పాటు చేసినప్పటి నుంచి తన భర్త పార్టీ కోసం పనిచేస్తున్నారని అయినప్పటికీ ఎలాంటి పదవులను తాము ఆశించలేదన్నారు. అయితే, పిలిచి మరీ సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా తనకు అవకాశం కల్పించారని గుర్తు చేశారు. మరి అలాంటిది తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఎందుకు తొలగించారని ఆమె ప్రశ్నించారు. ఇదెక్కడి అన్యాయం జగనన్నా? అంటూ నిలదీశారు. తనను ఎందుకు తొలగించారో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు