- పదిరోజులు కొనసాగనున్న లాక్‌డౌన్
- సమర్థంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం
- నిబంధనలు ఉల్లంఘించే వారిపై పోలీసుల చర్యలు
- రోడ్లపై ఎక్కడికక్కడ బారికేడ్లు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి లాక్‌డౌన్ ప్రారంభమైంది. పది రోజులు కొనసాగనున్న లాక్‌డౌన్ ను సమర్థంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. లాక్‌డౌన్ ప్రారంభమైన నేపథ్యంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. నిబంధనలు ఉల్లంఘించే వారిపై పోలీసులు చర్యలు తీసుకోనున్నారు.
రోడ్లపై ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసులు తనిఖీలు ప్రారంభించారు. రైతులకు, ప్రజా జీవనానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు కొన్ని రంగాలకు మాత్రమే లాక్‌డౌన్ నుంచి మినహాయింపులు ఉన్నాయి. అనుమతులు ఉన్న వారిని మాత్రమే పోలీసులు విడిచిపెడుతున్నారు.
అత్యవసర సరుకుల రవాణా వాహనాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వదిలిపెడుతున్నారు. బ్యాంకింగ్, మీడియా, వ్యవసాయం వంటి రంగాలకు చెందిన వారు ఐడీ కార్డులు, అనుమతి పత్రాలు చూపెడితే వారిని వదులుతున్నారు. వ్యాక్సినేషన్ కోసం వెళ్తున్న వారికి అనుమతి ఇస్తున్నారు.
సూర్యాపేటలోని రామాపురం చెక్ పోస్టు వద్ద వాహనాలను నిలిపివేశారు. ఏపీ నుంచి వచ్చే వాహనాలను పోలీసులు అడ్డుకుంటున్నారు. అంతర్రాష్ట్ర బస్సుల సేవలు, ఇతర వాహనాలపై నిషేధం విధించారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్కులు, క్రీడా మైదానాలు కూడా మూతపడ్డాయి.