పెద్ద కొడుకు అంత్యక్రియలు చేసొచ్చే లోపు.. చిన్న కుమారుడూ మృతి
- తల్లిదండ్రులకు తీరని విషాదం
- గ్రేటర్ నోయిడాలో ఘటన
- కరోనాతోనేనని అనుమానం
- టెస్టులు చేయని వైనం
- కొన్ని రోజుల్లోనే 18 మంది పోయారంటున్న గ్రామస్థులు
ఆ తండ్రి పెద్ద కుమారుడికి అంతిమసంస్కారాలు నిర్వహించి ఇంటికొచ్చాడు. ఆ దు:ఖమే తీరని ఆ తండ్రికి మరింత తీరని శోకమే మిగిలింది. పెద్ద కొడుకుకు అంత్యక్రియలు చేసి ఇంటికితిరిగొచ్చే లోపే చిన్న కొడుకూ చనిపోయి కనిపించాడు. గంటల వ్యవధిలోనే ఇద్దరు కుమారులు చనిపోవడంతో ఆ తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతంగా మారింది.
ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడాలో మంగళవారం జరిగింది. తీవ్రమైన జ్వరంతో చనిపోయిన తన పెద్ద కొడుకు పంకజ్ కు అతర్ సింగ్ అంత్యక్రియలు చేశాడు. ఆ తర్వాత ఇంటికి తిరిగొచ్చాక చిన్న కొడుకు దీపక్ కూడా చనిపోయి ఉన్నాడు. ఇద్దరు పిల్లలను ఒకేసారి కోల్పోవడంతో అతర్ సింగ్ భార్య కన్నీరుమున్నీరైంది. ఆమెను ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు.
అయితే, వారిద్దరికీ కరోనా టెస్టులు చేయకపోవడంతో కరోనాతోనే చనిపోయారా? లేక మామూలు మరణాలా? అనేదానిపై స్పష్టత లేదు. అయితే, గ్రామస్థులు మాత్రం కొన్ని రోజుల్లో ఆరుగురు మహిళలు సహా 18 మంది చనిపోయారని చెబుతున్నారు. తొలుత ఏప్రిల్ 28న రుషీ సింగ్ అనే యువకుడు జ్వరంతో చనిపోయాడని, ఆ తర్వాత అతడి కుమారుడు మరణించాడని చెప్పారు. చనిపోయినవారందరూ ముందు జ్వరంతో బాధపడ్డారని, ఆ తర్వాత ఆక్సిజన్ స్థాయులు తగ్గిపోయాయని అన్నారు.