తిరుపతిలో ఓ యాచకుడి ఇంట్లో రూ.10 లక్షలు… ఆశ్చర్యపోయిన అధికారులు!
- శ్రీనివాసన్ ఓ యాచకుడు
- తిరుమల కొండపై భిక్షాటన
- నిర్వాసితుడిగా భావించి తిరుపతిలో ఇల్లు కేటాయింపు
- ఏడాది కిందట మృతిచెందిన శ్రీనివాసన్
- వారసులు లేకపోవడంతో ఇంటిని స్వాధీనం చేసుకున్న టీటీడీ
- ఇంట్లో రెండు పెట్టెల నిండా డబ్బు
భిక్షాటనతోనూ కొందరు పెద్ద మొత్తంలో సంపాదిస్తున్న ఉదంతాలు తెలిసిందే. తాజాగా తిరుపతిలో ఓ యాచకుడి ఇంట్లో ఏకంగా రూ.10 లక్షలు బయటపడడం ఆశ్చర్యం కలిగిస్తోంది. శేషాచల నగర్ లోని అతడి నివాసంలో నోట్ల కట్టలు వెలుగుచూశాయి. ఆ యాచకుడి పేరు శ్రీనివాసన్. తిరుమల కొండపైకి వచ్చే వీఐపీల వద్ద భిక్షాటన చేసేవాడు. తిరుమల నిర్వాసితుడి కేటగిరీలో అతడికి తిరుపతిలో శేషాచల నగర్ లో ఇంటిని కేటాయించారు.
అయితే, శ్రీనివాసన్ అనారోగ్య కారణాలతో గతేడాది మరణించాడు. అతడికి నా అన్నవాళ్లెవరూ లేకపోవడంతో శేషాచల నగర్ లోని అతడి నివాసాన్ని టీటీడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లోకి ప్రవేశించిన టీటీడీ అధికారులు విస్మయానికి గురయ్యారు. రెండు పెట్టెలు తెరిచి చూడగా, అందులో కరెన్సీ కట్టలు కనిపించాయి. వాటి విలువ రూ.10 లక్షల వరకు ఉంటుందని భావిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.