మాన్సాఫ్ ట్రస్ట్ తీర్పుపై డివిజన్ బెంచ్ కు అప్పీల్ …అశోక గజపతి పదవి ఊడటం ఖాయం: విజయసాయిరెడ్డి
-అశోక్ గజపతిరాజు వల్లే పంచ గ్రామాల్లో సమస్య తలెత్తింది
-హైకోర్టు తీర్పును డివిజన్ బెంచ్‌లో సవాలు చేస్తాం
-పదేళ్లుగా విద్యా సంస్థల్లో ఎలాంటి ఆడిటింగ్ జరగలేదు
-మాన్సాస్ ట్రస్టుకు ఉన్న 14 వేల ఎకరాలను పరిరక్షించే బాధ్యత ప్రభుత్వానికి ఉంది
మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్‌గా అశోక్ గజపతి రాజును మళ్లీ నియమించాలన్న హైకోర్టు తీర్పును డివిజన్ బెంచ్‌లో అప్పీలు చేస్తామని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలిపారు. ఆయన వల్లే సింహాచలం పంచ గ్రామాల్లో సమస్య తలెత్తిందని విమర్శించారు. త్వరలోనే ఆయనను పదవి నుంచి తొలగిస్తామని చెప్పారు.
దేవాదాయశాఖ భూముల పరిరక్షణ, సింహాచలం పంచగ్రామాల సమస్యపై నిన్న విశాఖపట్టణంలో మంత్రులు వెల్లంపల్లి, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కన్నబాబు నేతృత్వంలో దేవాదాయశాఖ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
అనంతరం విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. విజయనగరంలో మాన్సాస్ ట్రస్టుకు ఉన్న 14 వేల ఎకరాల భూమిని పరిరక్షించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందన్నారు. ట్రస్టుకు ఉన్న 14 విద్యా సంస్థలకు ఒక్కరే కరస్పాండెంట్ ఉన్నారని, పదేళ్లుగా ఎలాంటి ఆడిటింగ్ జరగలేదని అన్నారు.
ఈ నేపథ్యంలో శాసనసభ్యుల అభ్యర్థనతో చర్యలు తీసుకోవాలని మంత్రి వెల్లంపల్లి అధికారులను ఆదేశించారని విజయసాయి అన్నారు. వెల్లంపల్లి మాట్లాడుతూ.. పంచగ్రామాల సమస్యను పరిష్కరించేందుకు తాము కృషి చేస్తుంటే అడవుల్లో భూములు ఇస్తున్నారని అశోక్ గజపతి విమర్శించడం సరికాదని అన్నారు.