Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
Date of Publish : 16 July 2025
Digital Edition : Drukpadam || దృక్పధం | Daily Telugu News Update

ప్రసన్నకుమార్ రెడ్డిపై ఏపీ హైకోర్టు ఆగ్రహం!

మహిళా ఎమ్మెల్యేపై ఇలాంటి వ్యాఖ్యలా… ప్రసన్నకుమార్ రెడ్డిపై ఏపీ హైకోర్టు ఆగ్రహం!
ఇటీవల టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలు
కేసు నమోదు.. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ నేత
తదుపరి విచారణ రేపటికి వాయిదా

ఇటీవల వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి టీడీపీ మహిళా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ క్రమంలో, ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలపై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళల గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించింది.

ఓ మహిళా ఎమ్మెల్యేపై అలాంటి వ్యాఖ్యలు చేయడమేంటి? మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా? అని హైకోర్టు ప్రశ్నించింది. ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై నమోదైన కేసులో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలతో “న్యూసెన్స్” సృష్టించారని హైకోర్టు వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను రేపటికి (బుధవారం) వాయిదా వేసింది.

ఇటీవల నెల్లూరు జిల్లాలో ఓ కార్యక్రమంలో ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడుతూ, ప్రశాంతి రెడ్డి వ్యక్తిగత, కుటుంబ అంశాలను ప్రస్తావిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అదే రోజు సాయంత్రం ఆయన నివాసంపై దాడి జరిగింది.

ప్రసన్నకుమార్ రెడ్డిపై చర్యలు తీసుకుంటున్నాం: అనిత

Anita Slams Jagan for Supporting Prasanna Remarks
  • ప్రశాంతిరెడ్డిపై ప్రసన్న వ్యాఖ్యలను కోర్టులు కూడా తప్పుపట్టాయన్న అనిత
  • జగన్ మానవత్వం ఉన్న వ్యక్తిలా వ్యవహరించడం లేదని మండిపాటు
  • సొంత చెల్లెలు గురించే తప్పుడు ప్రచారం చేసిన చరిత్ర జగన్ దని విమర్శ

వైసీపీ అధినేత జగన్ మానవత్వం ఉన్న మనిషిలా వ్యవహరించడం లేదని ఏపీ హోంమంత్రి అనిత మండిపడ్డారు. జగన్ నుంచే ప్రసన్నకుమార్ రెడ్డి నేర్చుకున్నారని… మహిళా (ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి) నేతపై ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలను న్యాయస్థానాలు కూడా తప్పుపట్టాయని చెప్పారు. ప్రసన్నపై చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 

ప్రసన్న తీరును జగన్ తప్ప ఎవరూ సమర్థించడం లేదని అనిత విమర్శించారు. రక్తం పంచుకుని పుట్టిన సొంత చెల్లెలు గురించే తప్పుడు ప్రచారం చేసిన చరిత్ర జగన్ దని మండిపడ్డారు. బెట్టింగ్ యాప్ లలో డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకున్నవారి కుటుంబాలను, రౌడీషీటర్లను జగన్ పరామర్శిస్తున్నారని చెప్పారు. జగన్ పర్యటనల్లో ఒకసారి తలకాయను, మరోసారి మామిడికాయలను తొక్కించారని అన్నారు. రప్పా రప్పా నరుకుతామని అనడం తప్పుకాదా? అని ప్రశ్నించారు.