Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
Date of Publish : 13 September 2025
Digital Edition : Drukpadam || దృక్పధం | Daily Telugu News Update

ఎట్టకేలకు ప్రధాని మోడీ మణిపూర్ పర్యటన…

ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌లో పర్యటిస్తోన్న ప్రధాని మోదీ.. జాతుల మధ్య ఘర్షణలకు కేంద్రమైన చురాచంద్‌పుర్‌ జిల్లాకు చేరుకున్నారు.

అక్కడ బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు. హింసాత్మక ఘటనల వల్ల నిరాశ్రయులైన వారితో మాట్లాడారు. 2023లో ఈ ఘర్షణలు చోటుచేసుకోగా.. రెండేళ్ల తర్వాత పీఎం ఆ రాష్ట్రానికి వెళ్లారు..
ఈ సందర్భంగా శరణార్థి శిబిరాల్లో ఉన్న చిన్నారులను పలకరించారు. ఈసందర్భంగా ఆయన చిత్రపటాన్ని ఓ చిన్నారి కానుకగా ఇచ్చింది. రాష్ట్రంలో శాంతిభద్రతలను పునరుద్ధరించేందుకు కేంద్రం కట్టుబడి ఉందని వారికి హామీ ఇచ్చారు. తర్వాత స్థానికంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మాట్లాడారు. ”మణిపుర్ ప్రకృతి ప్రసాదించిన కానుక. ఈ రాష్ట్ర ప్రజలకు తలవంచి నమస్కరిస్తున్నాను. ఇది సాహసవంతులు పుట్టిన నేల. మణిపుర్‌ లో కొండలు చాలా అందంగా ఉన్నాయి. పేరులో ఉన్న మణికి అర్థం.. ఈశాన్య రత్నమని. ఈ రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ధి పథంలోకి తీసుకువస్తాం. ఇలాంటి అందమైన ప్రాంతంలో హింస చెలరేగింది. కొత్త ఉషస్సు ప్రారంభం కానుంది. ప్రజలు శాంతి మార్గాన్ని ఎంచుకున్నారు. శాంతి చర్చలు మొదలయ్యాయి. నేను మీతో ఉన్నాను. కేంద్రం మీ వెంటే ఉంటుందని హామీ ఇస్తున్నాను. ఈ రాష్ట్రం శాంతికి చిహ్నంగా మారాలని కోరుకుంటున్నాను” అని మోదీ అన్నారు. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా సభకు వచ్చిన వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.

అసలు అక్కడ ఏమైందంటే..!

మెయిటీలకు రిజర్వేషన్లు ఇవ్వాలన్న ప్రతిపాదనపై వచ్చిన వ్యతిరేకత 2023లో మణిపుర్‌ను హింసాత్మకంగా మార్చిన సంగతి తెలిసిందే. వారికి రిజర్వేషన్లు ఇవ్వొద్దని ఆదివాసీ తెగలు డిమాండ్‌ చేశాయి. మెయిటీలకు రిజర్వేషన్లు దక్కితే వారు తమ అటవీ ప్రాంతాల్లో ఆవాసాలు ఏర్పాటుచేసుకోవడంతో పాటు తమకు రావాల్సిన ఉద్యోగాల్లో వాటా తగ్గిపోతుందని వారు ఆందోళన చెందారు. ఆ నిరసనలకు చురాచంద్‌పుర్‌ కేంద్రమైంది. రాష్ట్రంలోని పలు అటవీ ప్రాంతాలను రిజర్వ్‌ ప్రాంతాలుగా ప్రకటించడంతో కొండలపై నివాసమున్నవారు ఆగ్రహం వ్యక్తంచేశారు. కనీసం పునరావాసం కల్పించకుండా తమను తరలించడంపై నిరసన వ్యక్తంచేశారు. దీనికితోడు రిజర్వేషన్ల అంశం తెర పైకి రావడంతో నిరసనలు ఘర్షణ రూపం దాల్చాయి. ఆ క్రమంలో అమానవీయ ఘటనలు చోటుచేసుకున్నాయి. మణిపుర్‌లో చెలరేగిన అల్లర్లలో 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా కొన్ని వేల మంది నిరాశ్రయులయ్యారు. పలువురి ఆస్తులు ధ్వంసమయ్యాయి. ఈ హింసపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న బీరెన్‌సింగ్ ఈ ఏడాది తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.