Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
Date of Publish : 04 February 2026
Digital Edition : Drukpadam || దృక్పధం | Daily Telugu News Update

ప్రభుత్వాలు శాశ్వతం కాదు… రాజ్యసభలో కమల్ హాసన్ తొలి ప్రసంగం…

  • రాజ్యసభలో తొలిసారి ప్రసంగించిన నటుడు, ఎంపీ కమల్ హాసన్
  • సినిమా ద్వారానే తాను పార్లమెంటుకు వచ్చానని వెల్లడి
  • ఏ ప్రభుత్వమూ శాశ్వతం కాదని, అధికారం అశాశ్వతమని వ్యాఖ్య
  • ద్రావిడ నేతలు పెరియార్, అన్నాదురైలను గుర్తు చేసుకున్న కమల్
  • ప్రగతిశీల ప్రజాస్వామ్యంతో యువత ఎదగాలని పిలుపు

ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం (MNM) అధినేత కమల్ హాసన్ రాజ్యసభలో తన తొలి ప్రసంగంతో ఆకట్టుకున్నారు. బుధవారం నాడు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. ఏ ప్రభుత్వమూ శాశ్వతం కాదని, అధికారం ఎవరికీ శాశ్వతం కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన హితవు పలికారు.

“వివిధ రంగాలకు చెందిన వారు తమ ప్రజల తరఫున మాట్లాడేందుకు ఈ సభలోకి ప్రవేశించడానికి అనేక ద్వారాలు తెరుచుకుంటాయి. నాకు మాత్రం సినిమా ద్వారా ఆ ద్వారం తెరుచుకుంది” అని కమల్ హాసన్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. తనకు మద్దతిచ్చిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పెరియార్, సి.ఎన్. అన్నాదురై, మహాత్మా గాంధీ వంటి మహనీయుల ప్రభావం తన ఆలోచనలు, రాజకీయాలపై ఉందని పేర్కొన్నారు.

“మా భాష, సంస్కృతి, హక్కులపై ఎలాంటి దాడి జరిగినా ఎదుర్కోవాలని నేర్పిన సి.ఎన్. అన్నాదురై నాకు తమిళాన్ని పరిచయం చేశారు” అని కమల్ గుర్తుచేసుకున్నారు. ప్రజాస్వామ్యంపై మాట్లాడుతూ, “ఈ ప్రజాస్వామ్య రథం భేదాభిప్రాయాలను అధిగమించి ముందుకు సాగాలి కానీ, ప్రజలను అణచివేయకూడదు. దానిని మేము అనుమతించం” అని హెచ్చరించారు. ప్రపంచ చరిత్రలో ఏ ప్రభుత్వమూ శాశ్వతంగా నిలవలేదని, ప్రస్తుత ప్రభుత్వం కూడా అందుకు అతీతం కాదని స్పష్టం చేశారు.

“పిల్లలు గమనిస్తున్నారు, జెన్-జీ తరం చూస్తోంది. ఎదుగుతున్న ప్రగతిశీల ప్రజాస్వామ్యంతో పాటు వారిని కూడా ఎదగనివ్వండి. అప్పుడే రేపటి భవిష్యత్తు మనదవుతుంది” అని యువతకు పిలుపునిచ్చారు. కమల్ హాసన్ ప్రసంగానికి సభ్యుల నుంచి మంచి స్పందన లభించింది.