Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
Date of Publish : 13 February 2026
Digital Edition : Drukpadam || దృక్పధం | Daily Telugu News Update

ఆసక్తికరం.. ఛైర్మన్ పదవి ఇచ్చిన పార్టీకే మద్దతు అన్న స్వతంత్ర అభ్యర్థి…

  • అలియాబాద్‌లో ఏ పార్టీకి రాని మెజారిటీ
  • స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన గాదె వెంకటేశ్
  • మద్దతు కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రయత్నాలు

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా అలియాబాద్ మున్సిపాలిటీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మున్సిపాలిటీలో 20 వార్డులు ఉండగా ఏ పార్టీకి మెజార్టీ రాలేదు. ఇందులో కాంగ్రెస్ పార్టీ 8, బీఆర్ఎస్ 7, బీజేపీ 3, బీఎస్పీ 1 స్థానంలో విజయం సాధించాయి. ఏడో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి గాదె వెంకటేశ్ గెలుపొందారు.

మున్సిపల్ ఛైర్మన్ పదవి కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా స్వతంత్ర అభ్యర్థి గాదె వెంకటేశ్‌తో చర్చిస్తున్నాయి. అయితే మున్సిపల్ ఛైర్మన్ పదవిని తనకు ఎవరు ఇస్తే వారికి మద్దతు ఇస్తానని ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

వెంకటేశ్ కౌంటింగ్ కేంద్రం లోనికి వెళుతుండగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థులు, నాయకులు ఆయనను అడ్డుకుని మద్దతు కోసం ప్రయత్నించారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు జోక్యం చేసుకుని అతనిని కౌంటింగ్ కేంద్రంలోనికి తీసుకువెళ్లారు.

పలుచోట్ల ఏ పార్టీకి మ్యాజిగ్ ఫిగర్ రాలేదు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నేతలు స్వతంత్య్ర అభ్యర్థులతో చర్చిస్తున్నారు. వారిని క్యాంపులకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్‌లో 26 వార్డులకు గాను బీఆర్ఎస్ 12, కాంగ్రెస్ 10, స్వతంత్రులు 4 చోట్ల విజయం సాధించారు. దీంతో స్వతంత్రులను క్యాంపుకు తరలించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నాయి.