Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
Date of Publish : 14 February 2026
Digital Edition : Drukpadam || దృక్పధం | Daily Telugu News Update

మేము అనుకున్నన్ని రాలేదు… కాంగ్రెస్ పరిస్థితి కూడా అదే: కేటీఆర్

  • మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
  • 30కి పైగా మున్సిపాలిటీలు వస్తాయని అనుకున్నామన్న కేటీఆర్
  • హంగ్ వచ్చిన ప్రాంతాల్లో పరిస్థితి తమకు అనుకూలంగా ఉందని వ్యాఖ్య

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనదైన శైలిలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ 30కి పైగా మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటుందని తాము అంచనా వేశామని… కానీ తుది ఫలితాల్లో ఆ సంఖ్య కొంత మేర తగ్గిందని ఆయన తెలిపారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీపై కూడా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధికార కాంగ్రెస్ పార్టీకి కూడా ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదని అన్నారు. 

హంగ్ ఫలితాలు వచ్చిన మున్సిపాలిటీల్లో పరిస్థితి తమకు అనుకూలంగా ఉందని కేటీఆర్ చెప్పారు. చైర్మన్ పీఠాలను దక్కించుకోవడంలో కీలకమైన ఎక్స్ అఫీషియో ఓట్ల విషయంలో ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులతో చర్చించామని తెలిపారు. తమ పార్టీకి ప్రజాప్రతినిధులు ఉన్న ప్రతి చోటా కచ్చితంగా పట్టు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. 

కాంగ్రెస్ పార్టీ గాలిలో మేడలు కట్టిందని, కానీ క్షేత్ర స్థాయిలో ప్రజలు వారికి ఆశించినన్ని మున్సిపాలిటీలను ఇవ్వలేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఇదే సమయంలో ఆయన బీజేపీపై సెటైర్లు వేశారు. నిజామాబాద్, కరీంనగర్ వంటి ఒకటి రెండు ప్రాంతాల్లో మినహా ఆ పార్టీ ప్రభావం ఎక్కడా కనిపించలేదని అన్నారు.