Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
Date of Publish : 09 March 2026
Digital Edition : Drukpadam || దృక్పధం | Daily Telugu News Update

రూ.66 లక్షల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భర్తను చంపిన భార్య…

  • ఖమ్మం ఆటో డ్రైవర్ రవి హత్య కేసును ఛేదించిన పోలీసులు
  • భార్య ప్రశాంతే సూత్రధారి అని విచారణలో వెల్లడి
  • రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు విఫలయత్నం
  • ప్రశాంతితో పాటు మరో నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు

ఖమ్మంలో సంచలనం సృష్టించిన ఆటో డ్రైవర్ చాగంటి రవి (52) హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. భర్త అనారోగ్యంతో చనిపోతాడని భావించిన భార్య అతడి పేరుపై రూ.66 లక్షలకు బీమా చేయించింది. ఆ తర్వాత ఆ డబ్బుల కోసం భర్తను దారుణంగా చంపించింది. ఈ కేసులో ఆమెతో పాటు మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మం నగరానికి చెందిన రవి మద్యానికి బానిసై కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో అతడి భార్య ప్రశాంతి.. భర్త ఎలాగూ చనిపోతాడనే ఆలోచనతో ఓ పథకం వేసింది. గత ఏడాది జులైలో తన బంధువు శ్రీనివాస్ సహాయంతో రవి పేరు మీద రూ.66 లక్షలకు ఇన్సూరెన్స్ పాలసీ చేయించింది.

అయితే, నెలలు గడుస్తున్న కొద్దీ రవి ఆరోగ్యం మెరుగుపడటంతో ప్రశాంతిలో అసహనం పెరిగింది. బీమా డబ్బుల కోసం భర్తను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో శ్రీనివాస్‌తో పాటు జోగి రాజ్‌కుమార్, జోగి వెంకటేష్, జోగి రాంబాబులతో ఒప్పందం కుదుర్చుకుంది. హత్య చేస్తే వచ్చే బీమా డబ్బులో సగం ఇస్తానని వారికి ఆశ చూపింది.

పథకం ప్రకారం ఈ నెల 2వ తేదీన రవికి ఫుల్లుగా మద్యం తాగించి వీవీ పాలెం శివారు ప్రాంతానికి తీసుకెళ్లారు. అనంతరం కారుతో ఢీకొట్టి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. అయితే, ఈ ఘటనపై అనుమానంతో లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు, సాంకేతిక ఆధారాల సాయంతో అసలు నిజాన్ని బయటపెట్టారు. ఈ హత్య కేసులో ప్రధాన సూత్రధారి అయిన ప్రశాంతితో పాటు మిగిలిన నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.