Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
Date of Publish : 18 March 2026
Digital Edition : Drukpadam || దృక్పధం | Daily Telugu News Update

కొంతమంది ఇంకా తమను తాము రాజులుగా భావించుకుంటున్నారు: రేవంత్ రెడ్డి

కొంతమంది ఇంకా తమను తాము రాజులుగా భావించుకుంటున్నారు: రేవంత్ రెడ్డి

  • నియంత పోకడలతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని విమర్శ
  • ప్రజాస్వామ్యంలో ప్రజలే నాయకులు అన్న ముఖ్యమంత్రి
  • కేసీఆర్ సభకు వచ్చి సూచనలు, సలహాలు ఇవ్వాలని విజ్ఞప్తి

రాజ్యాలు పోయినా రాచరిక పోకడలు పోలేదని, కొంతమంది ఇంకా తమను తాము రాజులుగా భావించుకుంటున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. నియంత పోకడలతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు అదే పోకడ, ప్రతిపక్షంలో ఉన్నా అదే తీరు అని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే నాయకులు, రాజులు అని గుర్తుంచుకోవాలని సూచించారు.

రేవంత్ రెడ్డి శాసనసభలో మాట్లాడుతూ, గవర్నర్ ప్రసంగం ద్వారా రాష్ట్ర భవిష్యత్తు ప్రణాళికలను వివరించామని అన్నారు. గవర్నర్‌తో చర్చించిన తర్వాతనే ప్రసంగం తయారు చేసినట్లు తెలిపారు. కొత్త గవర్నర్‌ను కలిసేందుకు ప్రతిపక్ష నాయకులు వస్తారని భావించామని, ప్రధాన ప్రతిపక్షంగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతుందని భావించామని, గవర్నర్ ప్రసంగంపై సూచనలు, సలహాలు వస్తాయని భావించామని, కానీ ఏమాత్రం స్పందన రాలేదని అన్నారు.

కేసీఆర్ సభకు వచ్చి, ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. ప్రపంచ దిగ్గజ ఐటీ కంపెనీలు హైదరాబాద్‌లో ఏర్పాటయ్యేందుకు మాజీ ప్రధానమంత్రి పీవీ విధానాలే కారణమని అన్నారు. పీవీ, నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి హైటెక్ సిటీకి పునాది రాయి వేశారని తెలిపారు. ఆ తర్వాత చంద్రబాబు, వాజ్‌పేయి హైటెక్ సిటీని పూర్తి చేశారని రేవంత్ రెడ్డి అన్నారు. ఏఐ కారణంగా లక్షలాది ఉద్యోగాలు పోయి నిరుద్యోగ సమస్య తలెత్తే ప్రమాదం ఉన్నదని, ఈ పరిస్థితుల్లో భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.

హైడ్రా ద్వారా హైదరాబాద్‌లోని చెరువులను పునరుద్ధరిస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు. నాలాల ఆక్రమణలను పరిష్కరించి ముంపు సమస్యను పరిష్కరిస్తున్నామని అన్నారు. హైదరాబాద్‌లో నాలాలపై 28 వేల అక్రమ కట్టడాలు ఉన్నాయని గతంలో కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు. వాటిని నిర్దాక్షిణ్యంగా కూల్చాలని ఆయన హయాంలో ఆదేశాలు ఇచ్చారని, నాటి బీఆర్ఎస్ కార్యాచరణనే కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తోందని తెలిపారు.

సబర్మతి, గంగా, యమునా ప్రాజెక్టుల గురించి గొప్పగా చెబుతున్న బీజేపీ నాయకులు మూసీ ప్రాజెక్టును తప్పుబట్టడం విడ్డూరమని అన్నారు. మెట్రో రైలును విస్తరించేందుకు కష్టపడుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నగరానికి మూడు బుల్లెట్ రైళ్లు రానున్నాయని అన్నారు.